Sachin - Kohli: కోహ్లీ ఇచ్చిన విలువైన బహుమతి అతడికే తిరిగిచ్చా: సచిన్‌

సచిన్‌ తెందూల్కర్‌ ఎంతో మంది క్రికెటర్లకు, యువకులకు స్ఫూర్తిదాయకమైన ఆటగాడు. అలాంటి దిగ్గజం 24 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి చివరికి 2013లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు...

Published : 18 Feb 2022 11:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సచిన్‌ తెందూల్కర్‌ ఎంతో మంది క్రికెటర్లకు, యువకులకు స్ఫూర్తి. అలాంటి దిగ్గజం 24 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి చివరికి 2013లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అది యావత్‌ క్రికెట్‌ ప్రేమికులతో పాటు సచిన్‌కు కూడా అత్యంత బాధాకరమైన రోజుగా మిగిలింది. కాగా, అప్పుడు జట్టులో యువ ఆటగాడిగా ఉన్న విరాట్‌ కోహ్లీ.. తనకు ఓ విలువైన బహుమతి ఇచ్చాడని సచిన్‌ గుర్తుచేసుకున్నాడు. అయితే, దాన్ని కొద్దిసేపే తన వద్ద పెట్టుకొని తర్వాత అతడికే తిరిగి ఇచ్చేసినట్లు చెప్పాడు. అది తన జీవితంలో ఓ మర్చిపోలేని సంఘటన అని పేర్కొన్నాడు. తాజాగా ఓ అమెరికన్‌ జర్నలిస్ట్‌తో యూట్యూబ్‌లో మాట్లాడిన క్రికెట్‌ దిగ్గజం నాటి విశేషాల్ని ఇలా పంచుకున్నాడు.

‘‘ఆ రోజు నేను డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూర్చొని టవల్‌తో కళ్లను తుడుచుకుంటూ కూర్చున్నా. ఆ సమయంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యా. అప్పుడే కోహ్లీ నా వద్దకు వచ్చి ఒక పవిత్రమైన దారం ఇచ్చాడు. అది కోహ్లీకి వాళ్ల నాన్న ఇచ్చాడట. అయితే, దాన్నే నాకు ఎందుకు ఇచ్చాడో కూడా వివరించాడు. ‘మన దేశంలో చాలా మంది మణికట్టు వద్ద ఇలాంటి పవిత్రమైన దారాలు కట్టుకుంటారు. అలానే నాకూ ఈ దారాన్ని మా నాన్న ఇచ్చాడు. దాన్ని నేను ఎప్పుడూ నా బ్యాగ్‌లోనే పెట్టుకుంటాను. నా వద్ద ఉన్న అత్యంత విలువైనది ఇదేనని అనుకుంటున్నా. అందుకే దీన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నా. ఇంతకుమించింది నాతో ఏదీ లేదు. మీరు నాతో పాటు ఎంత మంది ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచారో తెలియజేసేందుకే మీకు ఈ దారం ఇవ్వాలనుకున్నా’ అని కోహ్లీ నాతో వివరించాడు’’ అని సచిన్‌ గుర్తుచేసుకున్నాడు.

‘‘ఇక నేను ఆ దారాన్ని కొద్దిసేపు నాతో పెట్టుకొని తిరిగి కోహ్లీకే ఇచ్చాను. అదెంతో విలువైనదని.. దాన్ని అతడి వద్దే పెట్టుకోమని, వేరే ఎవ్వరికీ ఇవ్వొద్దని చెప్పాను. అది మీ నాన్న ఇచ్చిన జ్ఞాపకం. నీ చివరి క్షణాల వరకూ నీతోనే ఉంచుకో’ అని కోహ్లీతో చెప్పినట్లు సచిన్‌ వివరించాడు. అదొక భావోద్వేగభరితమైన సంఘటన అని.. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి అని సచిన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని