Sachin Tendulkar: శ్రీశాంత్‌.. నిన్నెప్పుడూ టాలెంటున్న బౌలర్‌గానే చూశా: సచిన్

టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ను ఎల్లప్పుడూ టాలెంట్‌ ఉన్న బౌలర్‌గానే పరిగణించానని మాజీ సారథి, దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ తెందూల్కర్‌ పేర్కొన్నాడు...

Published : 14 Mar 2022 01:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ను ఎల్లప్పుడూ టాలెంట్‌ ఉన్న బౌలర్‌గానే పరిగణించానని మాజీ సారథి, దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ తెందూల్కర్‌ పేర్కొన్నాడు. శ్రీశాంత్‌ ఇటీవల అన్ని ఫార్మాట్ల ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సచిన్‌ గతరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెడుతూ టీమ్‌ఇండియాకు అతడు అందించిన సేవలను గుర్తుచేసుకున్నాడు. ‘ఎంతో నైపుణ్యం కలిగిన బౌలర్‌గానే నిన్ను ఎప్పుడూ చూశాను. కొన్ని సంవత్సరాల పాటు టీమ్‌ఇండియాకు నీ సేవలు అందించినందుకు కంగ్రాట్స్‌. ఇక నీ సెకండ్‌ ఇన్నింగ్స్‌కు ఆల్‌ ది వెరీ బెస్ట్‌’ అంటూ ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాడు.

కాగా, శ్రీశాంత్‌ టీమ్‌ఇండియా తరఫున 2005 నుంచి 2011 వరకు ఆరు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాడు. అదే సమయంలో టీమ్‌ఇండియా సాధించిన 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ జట్లలోనూ సభ్యుడిగా ఉన్నాడు. అయితే, 2013లో ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఇరుక్కొని జీవితకాల నిషేధం ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే న్యాయపోరాటం చేసిన అతడికి 2019 ఆగస్టులో కాస్త ఉపశమనం లభించింది. అతడిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించుకోగలిగాడు. దీంతో 2020 నుంచి మళ్లీ దేశవాళీ క్రికెట్‌లో కేరళ టీమ్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇక రెండేళ్లుగా తిరిగి ఐపీఎల్‌లో ఆడాలని చూస్తున్నా.. వేలంలో ఏ జట్లూ అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపడంలేదు. ఈ నేపథ్యంలోనే శ్రీశాంత్‌ తాజాగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని