Sachin: ఆ వ్యక్తి నుంచి నా తప్పు తెలుసుకున్నా

జీవితంలో ఎవరి నుంచైనా ఏ విషయమైనా నేర్చుకోవచ్చని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అన్నారు. ప్రస్తుత కొవిడ్‌-19 పరిస్థితుల కారణంగా ఆటగాళ్లు బయోబబుల్‌, క్వారంటైన్‌ వంటి నిబంధనలతో తీవ్ర మానసిక...

Published : 16 May 2021 21:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవితంలో ఎవరి నుంచైనా ఏ విషయమైనా నేర్చుకోవచ్చని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అన్నారు. ప్రస్తుత కొవిడ్‌-19 పరిస్థితుల కారణంగా ఆటగాళ్లు బయో బబుల్‌, క్వారంటైన్‌ నిబంధనలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘అన్‌అకాడమీ’ అనే ఆన్‌లైన్‌ విద్యాబోధన సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తెందూల్కర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్‌లోని పలు ఆసక్తికరమైన విషయాలు అందరితో పంచుకున్నారు. ఆటకు సన్నద్ధమవ్వడం అంటే శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.

‘నా కెరీర్‌లో కొంతకాలం తర్వాత ఆటకు సన్నద్ధమవడం అంటే శారీరకంగానే కాకుండా మానసికంగానూ సిద్ధమవ్వాలని తెలుసుకున్నా. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు తీవ్ర ఆందోళనకు గురయ్యేవాడిని. 10-12 ఏళ్ల పాటు ఎంతో మానసిక క్షోభ అనుభవించా. మ్యాచ్‌కు ముందు రోజు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. తర్వాత అది కూడా నా సన్నద్ధంలో ఒక భాగమని తెలుసుకున్నా. దాంతో మానసిక ప్రశాంతత సంపాదించా. నిద్ర పట్టనప్పుడు ఏదో ఒక పని చేసి బుర్రకు పనిచెప్పేవాడిని. అలాంటి సమయంలో సొంతంగా చాయ్‌ తయారు చేసుకోవడం.. బట్టలు ఇస్త్రీ చేసుకోవడం లాంటివి అలవాటు చేసుకున్నా. దాంతో అవి కూడా నా సన్నద్ధ ప్రక్రియలో భాగమయ్యాయి. నా చివరి మ్యాచ్‌ సందర్భంగా ఆఖరి రోజు కూడా ఇదే అలవాటును కొనసాగించా’ అని సచిన్‌ చెప్పుకొచ్చారు.

కెరీర్‌లో ఎదురయ్యే ఒడుదొడుకులనేవి  ఆటగాళ్లకు సహజమేనని సచిన్‌ అన్నారు. ఎవరి కెరీర్‌లో అయినా ఇలాంటివి ఉంటాయని చెప్పారు. కానీ, ఆటగాళ్లు ఎప్పుడైతే తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారో అప్పుడు వాస్తవాన్ని అంగీకరించాలని సూచించారు. ఆ సమయంలో ఆత్మీయులు తోడుగా ఉండాలన్నారు. అప్పుడు వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలోనే విజయం దాగుందని చెప్పారు. అలాంటప్పుడు చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మనోధైర్యం కల్పించాలన్నారు. అది తెలుసుకుంటే ఆటగాళ్లే తమ సమస్యల పరిష్కారానికి జవాబు వెతుక్కోగలరని పేర్కొన్నారు. చివరగా తాను నేర్చుకున్న ఓ జీవిత పాఠాన్ని పంచుకున్న తెందూల్కర్‌.. ఎవరి నుంచైనా ఏ విషయమైనా నేర్చుకోవచ్చని చెప్పారు. తాను ఆడే రోజుల్లో ఒకసారి చెన్నైలోని ఓ హోటల్‌లో బస చేసినప్పుడు అక్కడి సిబ్బంది ఒకరు తన బ్యాటింగ్‌కు సంబంధించి ఓ సలహా ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ‘ఆ వ్యక్తి నా గదికి దోశ తీసుకొచ్చి టేబుల్‌ మీద పెట్టాడు. తర్వాత నాకో సూచన చేశాడు. నా మోచేతికి ధరించే గార్డ్‌.. బ్యాట్‌ ఆడించేటప్పుడు ఇబ్బందిగా మారుతుందని చెప్పాడు. అతడు నిజంగానే నా బ్యాటింగ్‌ సమస్యను గుర్తించాడు. దాంతో నా తప్పును తెలుసుకొని సరిదిద్దుకున్నా’ అని సచిన్‌ అసలు విషయం వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు