Sachin Tendulkar: సచిన్‌ తొలి సెంచరీ రుచి చూసిన వేళ..!

పరుగుల వరద ఎప్పుడు మొదలుపెట్టామన్నది కాదు.. ప్రపంచ రికార్డులు దాసోహమయ్యాయా లేదా.. అన్నట్లు సాగింది మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ కెరీర్‌. చాలా మంది క్రికెటర్లతో పోల్చుకొంటే సచిన్‌ తొలిశతకం కొంచెం ఆలస్యం అయింది.

Updated : 14 Aug 2022 12:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పరుగుల వరద ఎప్పుడు మొదలుపెట్టామన్నది కాదు.. ప్రపంచ రికార్డులు దాసోహమయ్యాయా లేదా అన్నదే ముఖ్యం.. అన్నట్లు సాగింది మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ కెరీర్‌. చాలా మంది క్రికెటర్లతో పోల్చుకొంటే సచిన్‌ తొలి శతకం కొంచెం ఆలస్యమే అయ్యింది. కానీ, తొలి శతకం తర్వాత.. వేటకు దిగిన పులిలా బౌలర్లపై విరుచుకు పడటం మొదలైంది. 24 ఏళ్ల ఆయన కెరీర్‌లో 200 టెస్టు మ్యాచ్‌లు, 463 వన్డేలు ఆడారు. శతకాల వేటలో తనకు తానే సాటి అన్నట్లు 51 టెస్టు సెంచరీలు.. 49 వన్డే శతకాలతో ప్రపంచ రికార్డునే సృష్టించారు. 100 అంతర్జాతీయ శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా సచిన్‌ నిలిచారు. అతడి రికార్డుకు దరిదాపుల్లో కూడా నేటి తరం క్రికెటర్లు ఎవరూ లేరు.

సచిన్‌ తన టెస్టు కెరీర్‌లో తొలి శతకాన్ని 32 ఏళ్ల క్రితం ఇదే రోజు.. 1990 ఆగస్టు 14వ తేదీన ఇంగ్లాండ్‌పై మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో నమోదు చేశాడు. శతకం సాధించిన రెండో అతి పిన్న వయసు బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 17 సంవత్సరాల 112 రోజుల్లో ఈ ఘనతను అందుకొన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 189 బంతులను ఎదుర్కొని 119 పరుగులు సాధించాడు. సచిన్‌ శతకంతో భారత్‌ ఈ మ్యాచ్‌లో ఓటమి తప్పించుకొని డ్రా చేసుకొంది.

మాస్టర్‌ బ్లాస్టర్‌ తొలి టెస్టు శతకం కోసం మొత్తం 8 టెస్టు మ్యాచ్‌లు వేచి చూశాడు. ఓల్డ్‌ట్రాఫోర్డ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొంది. తొలి ఇన్నింగ్స్‌లో 519 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌ కూడా 432 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌కు 87పరుగల ఆధిక్యం లభించింది. దీంతో ఇంగ్లిష్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 320/4కు డిక్లేర్డ్‌ చేసి భారత్‌ ఎదుట 408 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే.. ఈ మ్యాచ్‌ను సచిన్‌ శతకంతో భారత్‌ డ్రాగా ముగించింది. 

సచిన్‌ తన తొలి టెస్టును 1989 నవంబర్‌లో కరాచీలో ఆడాడు. ఆ మ్యాచ్‌లో పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ వకార్‌ యూనిస్‌ కూడా కెరీర్‌ ప్రారంభించడం విశేషం. తొలి మ్యాచ్‌లో 15 పరుగులే చేసి వకార్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. అదే సిరీస్‌ చివర్లో సియాల్‌ కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో వకార్‌ బౌలింగ్‌లో సచిన్‌ ముక్కుకు బంతి తాకింది. అయినా కానీ, మైదానం వీడటానికి నిరాకరించి బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఆ తర్వాత పెషావర్లో జరిగిన ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో నాటి పాక్‌ స్టార్‌ లెగ్‌ స్పిన్నర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ ఖాన్‌ వేసిన ఒక్క ఓవర్‌లో 27 పరుగులు చేసి  ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని