SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ

శాఫ్‌ అండర్‌-19 ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్‌లో 3-2 తేడాతో నేపాల్‌ను ఓడించింది. 

Published : 27 Sep 2023 23:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్: శాఫ్‌ అండర్‌-19 ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్‌ పెనాల్టీ షూటౌట్‌లో 3-2 తేడాతో నేపాల్‌ను ఓడించింది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 1-1తో నిలవడంతో మ్యాచ్ టై బ్రేకర్‌కు వెళ్లింది. సాహిల్ ఖుర్షీద్ (26వ నిమిషంలో) గోల్‌ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. నేపాల్‌ ఆటగాడు సమీర్ తమాంగ్ (74వ నిమిషం) గోల్‌ చేసి స్కోరు సమం చేశాడు. 

ఇక పెనాల్టీ షూటౌట్‌లో 2-2తో ఇరుజట్లు హోరాహోరీగా తలపడుతున్న వేళ భారత ఆటగాడు మంగ్లెన్‌తాంగ్ కిప్‌జెన్ బంతిని ఎలాంటి తడబాటు లేకుండా గోల్‌ పోస్ట్‌లోకి పంపి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పెనాల్టీ షూటౌట్‌లో భారత్‌ తరఫున కిప్‌జెన్‌తో పాటు అర్జున్ సింగ్, గోయరీ గోల్స్‌ చేశారు. 66వ నిమిషంలో కెప్టెన్ ఇషాన్ శిశోడియా స్థానంలో రిప్లేస్‌మెంట్‌గా వచ్చిన కిప్‌జెన్ గోల్‌కొట్టి జట్టును గెలిపించడం ఆసక్తికరం. భూటాన్‌తో జరిగిన మరో సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్‌ 6-5 తేడాతో విజయం సాధించింది. శనివారం జరిగే టైటిల్‌ పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌ తలపడనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని