సిడ్నీ.. సైనికే తొలి ప్రాధాన్యం: నెహ్రా

ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు టీమ్‌ఇండియా మూడో పేసర్‌గా నవదీప్‌ సైనికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ పేసర్‌ ఆశీశ్‌ నెహ్రా సూచించాడు. అతడి బౌలింగ్‌లో అదనపు వేగం, బౌన్స్‌ ఉన్నాయన్నాడు. పిచ్‌ను అనుసరించి చూస్తే శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌ను ఎంపిక చేయడం సరైన తర్కం కాదని పేర్కొన్నాడు....

Published : 06 Jan 2021 01:36 IST

దిల్లీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు టీమ్‌ఇండియా మూడో పేసర్‌గా నవదీప్‌ సైనికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ పేసర్‌ ఆశీశ్‌ నెహ్రా సూచించాడు. అతడి బౌలింగ్‌లో అదనపు వేగం, బౌన్స్‌ ఉన్నాయన్నాడు. పిచ్‌ను అనుసరించి చూస్తే శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌ను ఎంపిక చేయడం సరైన తర్కం కాదని పేర్కొన్నాడు.

‘జట్టు కూర్పును పరిశీలిస్తే సైనికి తొలి ప్రాధాన్యం. శార్దూల్‌, నటరాజన్‌ గాయపడ్డ మహ్మద్‌ షమి, ఉమేశ్‌ స్థానాల్లో వచ్చారు. టెస్టు జట్టు ఎంపిక ప్రక్రియలో వారికన్నా సైని ముందున్నాడు. మొదట ఎంపిక చేశారంటే ఆ ఇద్దరికన్నా ప్రాధాన్యత ఎక్కువనే కదా అర్థం. బౌన్స్‌, అదనపు వేగం సైని బలాలు. ఇది టెస్టు మ్యాచు. నటరాజన్‌కూ వికెట్లు దొరుకుతాయి. కానీ మహ్మద్‌ సిరాజ్‌లా అతడిని భారత్‌-ఏకు ఆడించి పరీక్షించలేదు కదా. భారత్‌-ఏ తరఫున సైని విదేశాల్లో ఆడిన సంగతి తెలిసిందే. సాధారణంగా టెస్టుల్లో బ్యాట్స్‌మెన్‌ ఔటవ్వరు. వారిని ఔట్‌ చేయడమే అసలైన తేడా’ అని నెహ్రా అన్నాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌ సమయంలో పరిశీలించినప్పుడు సిడ్నీ పిచ్‌ ఫ్లాట్‌గా కనిపించిందని నెహ్రా తెలిపాడు. అలాంటి పిచ్‌లపై ఎక్స్‌ప్రెస్‌ వేగం ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నాడు. నవదీప్‌ సైనిలో అందుకు తగ్గ వేగం, బౌన్స్‌ ఉన్నాయని వెల్లడించాడు. కూకాబుర్ర బంతి మెరుపు పోయినప్పుడు అదనపు వేగం అవసరమన్నాడు.

సైని వేగంతో పాటు బంతిని రివర్స్‌స్వింగ్‌ చేయగలడని నెహ్రా అన్నాడు. నటరాజన్‌, శార్దూల్‌తో పోలిస్తే అతడు మెరుగ్గా బౌన్సర్లు విసరగలడని తెలిపాడు. ‘నవదీప్‌ నంబర్‌వన్‌ బౌలరని చెప్పను. అతడు ఇంకా మెరుగవ్వాలి. షోయబ్‌ అక్తర్‌, బ్రెట్‌లీలా 145-150 కి.మీ వేగంతో అతడు బంతులు విసరలేడు. అయితే అతడి సగటు వేగం 140గా ఉంది. మిగిలిన వాళ్లతో పోలిస్తే సిడ్నీకి అతడే అత్యుత్తమం’ అని నెహ్రా పేర్కొన్నాడు.

ఇవీ చదవండి
సైని × శార్దూల్‌.. ఎవరికి చోటు?
రోహిత్ శతకంతోనే తిరిగొస్తాడు: లక్ష్మణ్

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని