Wasim akram: నాతో బూట్లు తుడిపించేవాడు.. పాక్‌ మాజీ కెప్టెన్‌పై వసీం అక్రమ్‌ సంచలన ఆరోపణలు

పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్‌ ఆ దేశ మాజీ కెప్టెన్‌ సలీం మాలిక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Published : 29 Nov 2022 01:36 IST

దిల్లీ: పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్‌ ఆ దేశ మాజీ కెప్టెన్‌ సలీం మాలిక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను క్రికెటర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన తొలినాళ్లలో సలీం తననో పనివాడిలా చూసేవాడని, తనతో బట్టలు ఉతికించి, బూట్లు తుడిపించేవాడంటూ ఆరోపించాడు. ఈ మేరకు తన జీవిత చరిత్ర ‘‘సుల్తాన్‌ ఎ మెమోయర్‌’’లో పేర్కొన్నాడు. 

‘‘నేను అతడికన్నా రెండేళ్లు జూనియర్‌ను కావడంతో దాన్ని ఆసరాగా తీసుకునేవాడు. అతడు ప్రతికూల స్వభావం కలవాడు. ఎంతో స్వార్థపరుడు. నన్నో పనివాడిలా చూసేవాడు. తన బట్టలు ఉతకాలని, మసాజ్‌ చేయాలని నన్ను ఆదేశించేవాడు. అతడి బూట్లు సైతం నాతోనే తుడిపించేవాడు. అలాంటి సమయంలో జట్టులో నాకన్నా జూనియర్లైన రమీజ్‌, తాహిర్‌, మొహ్సిన్‌, షోయబ్‌ లాంటి వారు నన్ను నైట్‌ క్లబ్బులకు ఆహ్వానించినప్పుడు నాకు చాలా కోపం వచ్చేది’’ అని తెలిపాడు. 

మాలిక్‌ కెప్టెన్సీలో 1992 నుంచి 1995 వరకు వసీం అక్రమ్‌ జట్టులో ఉన్నాడు. ఆనాటి నుంచే వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు లేవని తెలుస్తోంది. ఈ విమర్శలపై ఇటీవల మాలిక్‌ స్పందిస్తూ ఇవన్నీ అవాస్తవాలేనంటూ కొట్టిపారేశాడు. వసీం తన పుస్తకం అమ్మకాలు పెంచుకునేందుకే ఇదంతా చేస్తున్నాడన్నాడు. తాను కెప్టెన్‌గా ఉండగా వసీం, వకార్‌ యూనిస్‌ తనతో మాట్లాడేవారు కాదని తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని