Butt vs Vaughan: కోహ్లీ కోసం గొడవ!

ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌, పాక్‌ క్రికెటర్‌ సల్మాన్ భట్‌ మధ్య మాటల యుద్ధం....

Published : 18 May 2021 01:51 IST

ముదురుతున్న మాటల యుద్ధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌, పాక్‌ క్రికెటర్‌ సల్మాన్ భట్‌ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వాన్‌ అసలు  విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాడని భట్‌ అన్నాడు. కొందరికి మానసిక అజీర్తి అనే రుగ్మత ఉంటుందని విమర్శించాడు. మాటలు, చేతలను బట్టే అతడి మూర్తిమత్వం ఏంటో తెలుస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించాడు. గతం గురించి మాట్లాడటంలో అర్థం ఏముందని ప్రశ్నించాడు. 2010లో భట్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసి నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ పోలికపైనే వీరిద్దరి మధ్య మాటలు ముదిరాయి. ‘కేన్‌ భారతీయుడు అయ్యుంటే ప్రపంచ నంబర్‌ వన్‌ అయ్యేవాడు. కోహ్లీని కాదంటే సోషల్‌ మీడియాలో నా మీద రాళ్లు విసురుతారు. అందుకే అతడే అత్యుత్తమం. ఆట పరంగా వీరిద్దరూ సమానమే. సోషల్‌ మీడియాలో కోట్ల మంది అనుచరులు, ఏటా వార్షిక ఒప్పందాల ద్వారా డబ్బు ఆర్జించడంలోనే తేడా. నా దృష్టిలో విలియమ్సన్‌ ఎక్కువ పరుగులు చేస్తాడు. కోహ్లీ కాదు’ అంటూ వాన్‌ వివాదాస్పదంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అలా కాదని.. కోహ్లీ అత్యుత్తమ ఆటగాడగాని.. వాన్‌ వ్యాఖ్యలు తప్పని భట్‌ కొట్టి పారేశాడు. దాంతో భట్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదాన్ని వాన్‌ వెటకారంగా ఎత్తి చూపాడు.

‘వివరాల్లోకి వెళ్లను. వాన్‌ ఎంచుకున్న కోణం తప్పు. అతడు నన్ను విమర్శించడంలో అర్థం లేదు. నా గతం గురించి మాట్లాడటం స్థాయికి తగింది కాదు. అది దిగజారుడు తనమే! ఇంకా దాని గురించే మాట్లాడాలనుకుంటే అతనిష్టం.  అజీర్తి ఓ రుగ్మత. లోపల ఉన్నవి అంత సులభంగా బయటకు రావు. కొందరికి మానసిక అజీర్తి ఉంటుంది. వారి బుద్ధి ఇంకా గతంలోనే ఉండిపోయింది. నేను వాటిని పట్టించుకోను’ అని భట్‌ స్పందించాడు.

‘మేం ఇద్దరు గొప్ప ఆటగాళ్ల గురించి మాట్లాడాం. చర్చ దిశను మళ్లించాల్సిన అవసరం లేదు. కానీ వాన్‌ మరో వైపే వెళ్లాడు.  గతం గతః అలాగని నిజాలు మారవు కదా. అతడు తర్కబద్ధమైన ఉదాహరణలు, అనుభవ పూర్వక పరిశీలనలు, సంబంధిత గణాంకాలు ఇస్తే బాగుండేది. దాన్నుంచి మేమూ నేర్చుకొనేవాళ్లం’ అని భట్‌ అన్నాడు.

‘వాన్‌ క్రికెట్‌ గురించి మాట్లాడి మమ్మల్ని తప్పని నిరూపిస్తే అతడు సరైన వాడే అని అనుకునేవారు. అప్పుడు సరదాగా ఉండేది. అలాకాకుండా కళంకిత వ్యవహారంపై స్పందించాడు. దీంతో అతనేంటో తెలుస్తోంది. అతడింకా దానినే కొనసాగించొచ్చు. కానీ దాంతో ఏం లాభం? ఏదేమైనా అతడు తానేంటో నిర్వచించుకున్నాడు’ అని భట్‌ తన యూట్యూబ్ ఛానళ్లో చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని