SL vs IND: టీమ్‌ఇండియాతో టీ20, వన్డే సిరీస్‌.. శ్రీలంక హెడ్‌ కోచ్‌గా జయసూర్య

శ్రీలంక, భారత్ (SL vs IND) మధ్య మరికొన్ని రోజుల్లో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌ల్లో మాజీ ఆటగాడు సనత్‌ జయసూర్య శ్రీలంక జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. 

Updated : 08 Jul 2024 12:58 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక (Sri Lanka) పేలవమైన ప్రదర్శన చేసింది. కనీసం సూపర్-8కు కూడా అర్హత సాధించకుండా లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ప్రధాన కోచ్‌గా ఉన్న క్రిస్‌ సిల్వర్‌వుడ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఇదిలాఉండగా.. ఈ నెలఖారులో టీమ్ఇండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంకతో మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది. దీంతో మాజీ ఆటగాడు సనత్ జయసూర్య (Sanath Jayasuriya)ను తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా నియమించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. 2024 టీ20 ప్రపంచకప్‌లో జయసూర్య శ్రీలంక జట్టుకు క్రికెట్ కన్సల్టెంట్‌గా సేవలందించాడు. అతడు 2023 డిసెంబరు నుంచి ఈ బాధ్యతల్లో కొనసాగుతూ ప్రేమదాస స్టేడియం (కొలంబో)లోని హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఆటగాళ్లు, కోచ్‌లను పర్యవేక్షిస్తున్నాడు. కొత్త కోచ్‌ను నియమించేవరకు జయసూర్య తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

టీ20 ప్రపంచకప్‌ 2024 ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ఇండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో అయిదు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. జులై 14తో ఈ సిరీస్ ముగుస్తుంది. అనంతరం ఈ నెలాఖరులో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంకతో జులై 27-30 మధ్య మూడు టీ20లు, ఆగస్టు 2-7 మధ్య మూడు వన్డేలు ఆడనుంది. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లకు టీమ్ఇండియా కొత్త కోచ్‌ను నియమించే అవకాశముంది. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగిసిన సంగతి తెలిసిందే. జింబాబ్వే టూర్‌లో టీమ్ఇండియాకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని