Sania Mirza: రిటైర్మెంట్‌పై సానియా మీర్జా కొత్త ప్రకటన!

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన రిటైర్మెంట్‌పై కొత్త ప్రకటన చేసింది. గత ఏడాదే ఆట నుంచి తప్పుకోవాలని అనుకున్నప్పటికీ, ఆ తర్వాత మనసు మార్చుకున్న ఆమె.. తాను వీడ్కోలు పలకబోయే టోర్నీ ఏదో చెప్పేసింది.

Updated : 07 Jan 2023 08:37 IST

దిల్లీ: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన రిటైర్మెంట్‌పై కొత్త ప్రకటన చేసింది. గత ఏడాదే ఆట నుంచి తప్పుకోవాలని అనుకున్నప్పటికీ, ఆ తర్వాత మనసు మార్చుకున్న ఆమె.. తాను వీడ్కోలు పలకబోయే టోర్నీ ఏదో చెప్పేసింది. ఫిబ్రవరిలో దుబాయ్‌ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీలో తాను కెరీర్‌ను ముగించనున్నట్లు సానియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కొత్త ఏడాదిలో ముందుగా 36 ఏళ్ల సానియా ఆస్ట్రేలియా ఓపెన్‌ ఆడనుంది. అందులో కజకిస్థాన్‌ క్రీడాకారిణి అనా డనిలినాతో కలిసి ఆమె మహిళల డబుల్స్‌లో పోటీ పడనుంది. ఇదే ఆమెకు చివరి గ్రాండ్‌స్లామ్‌ కానుంది. ఆ టోర్నీ పూర్తయ్యాక దుబాయ్‌లో ఆమె కెరీర్‌ చిట్టచివరి టోర్నీ ఆడనుంది. నిరుడు యుఎస్‌ ఓపెన్‌ ఆడి ఆటకు గుడ్‌బై చెప్పాలనుకున్న సానియాకు గాయం అడ్డంకిగా మారింది. అందుకే రిటైర్మెంట్‌ను వాయిదా వేసుకుంది. ‘‘నిజాయితీగా చెప్పాలంటే నేను ఏ విషయమైనా నాకు ఇష్టమైన రీతిలో చేయాలనుకుంటా. గాయంతో కెరీర్‌ను ముగించాలనుకోలేదు. అందుకే మళ్లీ సాధన చేశా’’ అని సానియా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని