Sania Mirza : ఇదే చివరి సీజన్‌

భారత స్టార్‌ సానియా మీర్జా సుదీర్ఘ టెన్నిస్‌ ప్రయాణానికి త్వరలోనే తెరపడనుంది. 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో తన ఆటతో దేశంలో ఎంతోమంది యువ క్రీడాకారిణులకు ఆదర్శంగా నిలిచిన సానియా టెన్నిస్‌కు వీడ్కోలు పలకనుంది.

Updated : 20 Jan 2022 07:27 IST

ఆటకు వీడ్కోలు పలుకుతా

దేహం సహకరించడం లేదు

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా

మెల్‌బోర్న్‌

భారత స్టార్‌ సానియా మీర్జా సుదీర్ఘ టెన్నిస్‌ ప్రయాణానికి త్వరలోనే తెరపడనుంది. 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో తన ఆటతో దేశంలో ఎంతోమంది యువ క్రీడాకారిణులకు ఆదర్శంగా నిలిచిన సానియా టెన్నిస్‌కు వీడ్కోలు పలకనుంది. 2022 సీజన్‌ తర్వాత రిటైరవుతానని బుధవారం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌ ఓటమి అనంతరం సానియా ప్రకటించింది.

భారత టెన్నిస్‌ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న హైదరాబాదీ సంచలనం సానియా మీర్జా త్వరలోనే రాకెట్‌ను పక్కన పెట్టబోతోంది. పెళ్లయి ఓ బిడ్డకు తల్లయ్యాక కూడా ఆటలో కొనసాగుతూ వచ్చిన ఆమె.. ఇకపై టెన్నిస్‌ ఆడేందుకు తన దేహం సహకరించడం లేదని తేల్చేసింది. బుధవారం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో ఓటమి అనంతరం ఆమె ఈ నిర్ణయానికి వచ్చింది. 35 ఏళ్ల సానియా.. రాజీవ్‌ రామ్‌ (అమెరికా)తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బరిలో ఉంది.

‘‘వీడ్కోలు నిర్ణయానికి చాలా కారాణాలు ఉన్నాయి. మ్యాచ్‌ తర్వాత కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. నా కుమారుడి వయసు మూడేళ్లు. ఎక్కువ ప్రయాణాలతో అతణ్ని ప్రమాదంలో నెడుతున్నట్లు అనిపిస్తుంది. దురదృష్టవశాత్తు కరోనా మహమ్మారి నేపథ్యంలో మనం, కుటుంబం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే నా దేహం అలసిపోతుంది. నా మోకాలి గాయం ఈరోజు తీవ్రంగా బాధించింది. మ్యాచ్‌లో ఓటమికి అది కారణమని చెప్పట్లేదు. వయసు పెరుగుతుండటంతో రికవరీకి చాలా సమయం పడుతుంది. ప్రతిరోజూ ప్రేరణ పొందడానికి ఇప్పుడున్న శక్తి సరిపోవట్లేదు. ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం ఆడతానని ఎప్పుడూ చెప్పా. ఇకమీదట ఆటను ఆస్వాదిస్తానని కచ్చితంగా చెప్పలేను. ఈ సీజన్‌లో ఆడేందుకు ప్రయత్నిస్తున్నా. మళ్లీ రాకెట్‌ పట్టడానికి చాలా కష్టపడ్డా. బరువు తగ్గించుకుని ఫిట్‌గా మారా. అమ్మలు, తల్లి కాబోయే వాళ్లు తమ కలలను సాకారం చేసుకునేందుకు మంచి ఉదాహరణగా నిలిచేందుకు ప్రయత్నించా. ఈ సీజన్‌ తర్వాత నా దేహం సహకరిస్తుందని అనుకోను. ప్రస్తుతం అత్యున్నత స్థాయిలో ఆడుతున్నా. మొదటి వారం ఈవెంట్లో టాప్‌-10, 20 క్రీడాకారిణుల్ని ఓడించాం. ఇదే చివరి సీజన్‌ అని నాకు కచ్చితంగా తెలుసు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడేందుకు మరోసారి మెల్‌బోర్న్‌కు రాను. జూన్‌, జులై వరకు ఎదురు చూడట్లేదు. నా దేహం, మహమ్మారి, అనిశ్చితి నేపథ్యంలో ఒక్కో వారం గురించే ఆలోచిస్తున్నా. ఈ సీజన్‌ను పూర్తిచేస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు. పూర్తి సీజన్‌ ఆడాలని మాత్రం ఉంది. ఇప్పటికీ 50-60 ర్యాంకింగ్‌లో ఉన్నా. ఆడగలిగే స్థాయి ఉందనే అనుకంటున్నా. యూఎస్‌ ఓపెన్‌లో ఆడి సీజన్‌ ముగించాలన్నది నా లక్ష్యం. ఏం జరుగుతుందో చెప్పలేను. వారం వారం పరిస్థితిని సమీక్షించుకుంటా’’ అని సానియా తెలిపింది.

అసమాన పోరాటం: ఆరేళ్లకే టెన్నిస్‌ రాకెట్‌ పట్టి.. 15 ఏళ్లకు (2003లో) ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో అడుగుపెట్టిన సానియా మరే భారత క్రీడాకారిణికి సాధ్యంకాని ఎన్నో ఘనతల్ని అందుకుంది. 2003 నుంచి 2013లో సింగిల్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించే వరకు భారత్‌ తరఫున నంబర్‌వన్‌ డబ్ల్యూటీఏ క్రీడాకారిణి సానియానే. సింగిల్స్‌ కెరీర్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంకు సాధించింది. 2013 తర్వాత పూర్తిగా డబుల్స్‌పైనే దృష్టిసారించిన సానియా ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు కైవసం చేసుకుంది. వాటిలో మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మూడేసి టైటిళ్లు ఉన్నాయి. 2015లో మార్టినా హింగిస్‌తో జట్టుకట్టిన సానియా వరుసగా 44 మ్యాచ్‌ల్లో విజయభేరి మోగించడం విశేషం. 2015 ఏప్రిల్‌ 13న మహిళల డబుల్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంకు సాధించింది. రికార్డు స్థాయిలో 91 వారాల పాటు నంబర్‌వన్‌గా కొనసాగింది. 2018 అక్టోబరులో కుమారుడికి జన్మనిచ్చిన సానియా రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉంది. అనంతరం టోక్యో ఒలింపిక్స్‌లో బరిలో దిగిన ఆమె పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సానియా తన కెరీర్‌లో 43 డబ్ల్యూటీఏ డబుల్స్‌ టైటిళ్లు సాధించడం విశేషం. ప్రస్తుతం డబ్ల్యూటీఏ సర్క్యుట్‌లో ఆడుతున్న క్రీడాకారిణుల్లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ప్లేయర్‌ సానియానే. వయసు మీద పడుతుండటం.. దేహం సహకరించకపోవడం.. కరోనా నేపథ్యంలో ఆటకు వీడ్కోలు పలకాలని ఆమె నిర్ణయించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని