Rishabh Pant: ‘తెందూల్కర్‌లా పంత్‌ను కూడా ఓపెనర్‌గా తీసుకొస్తే మెరుస్తాడు’

యువ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ను పొట్టి ఫార్మాట్‌లో ఓపెనర్‌గా మార్చాలని టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 21 Jun 2022 01:52 IST

మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌

(Photo: Sanjay Bangar Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: యువ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ను పొట్టి ఫార్మాట్‌లో ఓపెనర్‌గా మార్చాలని టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సూచించాడు. సచిన్‌ తెందూల్కర్‌ కూడా మిడిల్‌ ఆర్డర్‌ నుంచి ఓపెనర్‌గా మార్చాకనే గొప్పగా రాణించాడని గుర్తు చేశాడు. దీంతో పంత్‌ను కూడా ఓపెనర్‌గా మారిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయని అన్నాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌ చర్చా కార్యక్రమంలో బంగర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘పంత్‌ను ఓపెనర్‌గా చేయాలని మూడేళ్లుగా అనుకుంటున్నా. తెందూల్కర్‌ కెరీర్‌ను పరిశీలించినా.. న్యూజిలాండ్‌ పర్యటనలో ఓపెనర్‌గా మార్చిన అనంతర రాణించాడు. అతడు తన 75 లేదా 76వ ఇన్నింగ్స్‌లో తొలి శతకం సాధించాడు’ అని బంగర్‌ పేర్కొన్నాడు. దీంతో పంత్‌ను కూడా భవిష్యత్‌లో ఓపెనర్‌గా తీసుకొస్తే మెరుస్తాడని, అది లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ కాంబినేషన్‌కు కూడా సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇషాన్‌ కిషన్‌ లెఫ్ట్‌హ్యాండ్‌  ఓపెనర్‌గా ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడని.. కానీ, దీర్ఘకాలం గురించి ఆలోచిస్తే పంతే ఓపెనర్‌గా సరిపోతాడని బంగర్‌ చెప్పుకొచ్చాడు. ఇక టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం బంగర్‌ వ్యాఖ్యలను సమర్థించాడు. పంత్‌ను ఓపెనర్‌గా తీసుకొస్తే పవర్‌ప్లేలో బౌలర్లపై ఎదురుదాడి చేస్తాడని చెప్పాడు. దాంతో జట్టుకు మంచి ఉపయోగం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని