టీమ్‌ఇండియా పాఠం నేర్చుకుంది 

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ శైలిపై మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించే ముందు...

Updated : 27 Mar 2021 12:59 IST

కోహ్లీసేనపై మంజ్రేకర్‌ తీవ్ర వ్యాఖ్యలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ శైలిపై మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించే ముందు.. పిచ్‌, మైదానం పరిస్థితులతో పాటు ప్రత్యర్థి బ్యాటింగ్‌ బలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. మ్యాచ్‌ అనంతరం వరుస ట్వీట్లు చేసిన మంజ్రేకర్‌.. ఈ ఫలితంతో టీమ్‌ఇండియా ఒక పాఠం నేర్చుకుందని పేర్కొన్నాడు.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 336/6 పరుగుల భారీ స్కోర్‌ సాధించిన సంగతి తెలిసిందే. రాహుల్‌(108), పంత్‌(77), కోహ్లీ(66), హార్దిక్‌పాండ్య(35) అద్భుతంగా ఆడారు. అయినా, ఇంత పెద్ద లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ అలవోకగా ఛేదించింది. బెయిర్‌స్టో(124), బెన్‌స్టోక్స్‌(99), జేసన్‌రాయ్‌(55) దంచి కొట్టడంతో నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 43.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ నేపథ్యంలోనే మంజ్రేకర్‌ టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ విధానంపై విమర్శలు గుప్పించాడు.

‘ఒక లక్ష్యాన్ని నిర్దేశించే ముందు.. పిచ్‌, మైదాన పరిస్థితులతో పాటు ప్రత్యర్థి బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ఫలితంతో టీమ్‌ఇండియా ఒక పాఠం నేర్చుకుంది. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం గత మ్యాచ్‌లో శార్దూలే‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌. అతడు ఆ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయకపోతే ఇలాంటి ఫలితమే నమోదయ్యేది. ఇక ఈరోజు అదే బ్యాటింగ్‌ పిచ్‌పై మోయిన్‌ అలీ 10 ఓవర్లు బౌలింగ్‌ చేసి 47 పరుగులే ఇచ్చాడు. ఈ గణాంకాలు అతడు అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని కాదు.. కోహ్లీసేన అతడిపై ఎదురుదాడి చేయలేకపోవడం. ఇలాంటి బ్యాటింగ్‌ పిచ్‌పై టీమ్‌ఇండియా చేసిన పెద్ద తప్పుగా దీన్నే భావించొచ్చు’ అని మంజ్రేకర్‌ ట్వీట్లు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని