WTC Final: అజింక్య రహానె స్వేచ్ఛగా ఆడేస్తాడు..: సంజయ్‌ మంజ్రేకర్

దేశవాళీ, ఐపీఎల్‌లో రాణించిన అజింక్య రహానెకు (Ajinkya Rahane) డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికయ్యాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత టెస్టుల్లోకి తిరిగి వచ్చాడు.

Published : 08 Jun 2023 13:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో అదరగొట్టిన అజింక్య రహానె డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final 2023) తుది జట్టులోకి వచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడటంతో రహానెకు అవకాశం దక్కింది. దాదాపు 18 నెలల తర్వాత జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. గత సీజన్‌ ఫైనల్‌ ఆడే సమయంలో అతడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని పేర్కొన్నాడు. ఈసారి మాత్రం చాలా స్వేచ్ఛగా ఆడేస్తాడనే నమ్మకం ఉందని చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ రహానెకు కీలకమని తెలిపాడు. 

‘‘గతంలో భారత్ తరఫున ఆడినప్పుడు కాస్త ఒత్తిడితో ఉండేవాడు. ఇదే చివరి టెస్టు మ్యాచ్‌ అన్నట్లుగా బ్యాటింగ్‌కు దిగితే నాణ్యమైన ప్రదర్శన రావడం కష్టమే. ఇప్పుడు మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌కు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రిటైర్‌మెంట్‌ను అధికారికంగా ప్రకటించకపోయినా.. అదే స్థితిలో ఉన్నాడు. కాబట్టి, డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ రహానెకు మంచి అవకాశం. ఈసారి స్వేచ్ఛగా ఆడతాడని భావిస్తున్నా. 

రహానె ఐపీఎల్‌లో బాగా ఆడాడు కాబట్టే అతడికి అవకాశం వచ్చిందని అభిమానులు ఇప్పటికీ భావిస్తుంటారు. కానీ, అతడి దేశవాళీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. జట్టుకు ప్రయోజనం చేకూరుతుందనడంలో సందేహం లేదు. గతంలో నన్ను జట్టు నుంచి తప్పించారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో భారీగా పరుగులు చేసి మళ్లీ జట్టులోకి వచ్చా. టెస్టు క్రికెట్‌ అనేది ఓ ప్రత్యేకమైన ఫార్మాట్‌. తప్పకుండా రహానె స్వేచ్ఛగా ఆడతాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. అయితే, ఎలా ఆడతాడనేది ఇప్పుడే చెప్పలేం’’ అని మంజ్రేకర్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని