Asia Cup - IND vs PAK: పాక్‌పై భారత్‌ గెలవాలంటే అదొక్కటే మార్గం: మాజీ క్రికెటర్

ఆసియాకప్‌లో అత్యంత ఆసక్తికరమైన పోరు భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ అనడంలో సందేహం లేదు. అయితే, వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్‌ జరిగితే మాత్రం టీమ్‌ఇండియా బ్యాటర్లు పైచేయి సాధించాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.

Updated : 31 Aug 2023 13:58 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూస్తోన్న దాయాదుల పోరుకు (IND vs PAK) సమయం సమీపిస్తోంది. సెప్టెంబర్ 2న శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. దీని కోసం రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్‌ఇండియా (Team India) సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత ప్రదర్శనపై మాజీ క్రికెటర్, క్రీడా విశ్లేషకుడు సంజయ్‌ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్‌పై గెలవాలంటే భారత బ్యాటింగ్‌ లైనప్‌ కీలక పాత్ర పోషించాలని.. మరీ ముఖ్యంగా టాప్‌ ఆర్డర్‌ రాణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. త్వరగా వికెట్లు కోల్పోకుండా చూసుకోవాలని.. లేకపోతే మాత్రం పాక్‌ను కట్టడి చేయడం కష్టమవుతుందని తెలిపాడు. వన్డే మ్యాచ్‌ను ప్రారంభించేటప్పుడు టెస్టు క్రికెట్ స్కిల్స్‌ను ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. ఇన్నింగ్స్ ముందుకు సాగేకొద్దీ దూకుడు పెంచాలని సూచించాడు. 

ఆసియా కప్‌ అంటే ధోనీ గుర్తుకొస్తాడు.. ఎందుకంటే..?

‘‘భారత్‌కు టాప్‌-3లో రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీరంతా అద్భుతమైన టెస్టు ఆటగాళ్లు. ఇదేంటి వన్డే క్రికెట్‌ గురించి మాట్లాడేటప్పుడు టెస్టుల సంగతి ఎందుకు? అనే సందేహాం మీకు రావచ్చు. అయితే, 50 ఓవర్ల మ్యాచ్‌ను ప్రారంభించేటప్పుడు టెస్టు అనుభవం అక్కరకొస్తుంది. ఇన్నింగ్స్‌ను నిలకడగా ప్రారంభించి.. మెల్లగా గేర్లు మార్చుకుంటూ పోవాలి. గత వరల్డ్‌ కప్‌లో రోహిత్ శర్మ ఐదు సెంచరీలు బాదాడు. తొలి పది ఓవర్లలో ప్రత్యర్థి బౌలింగ్‌ను గౌరవిస్తూ క్రీజ్‌లో కుదురుకునేందుకు సమయం తీసుకోవడం నాకిప్పటికీ గుర్తుంది. అందుకే, ఈసారి కూడా ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి. త్వరగా వికెట్లను సమర్పించకుండా ఉంటే మ్యాచ్‌ భారత్‌దే అవుతుంది’’ అని మంజ్రేకర్ తెలిపాడు. 

కేఎల్ రాహుల్‌ బహుముఖ ఆటగాడు: సంజయ్ బంగర్

‘‘బెంగళూరు ట్రైనింగ్‌ క్యాంప్‌లో కేఎల్ రాహుల్ (KL Rahul) విభిన్న స్థానాల్లో బ్యాటింగ్‌ చేశాడు. అందుకే అతడిని బహుముఖ ఆటగాడని చెబుతా. ఇన్నింగ్స్‌ను ప్రారంభించడంతోపాటు అవసరమైతే ఐదో స్థానంలోనూ బ్యాటింగ్‌ చేయగల సమర్థుడు. ఇప్పటికే భారత్ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చాలా ప్రయోగాలు చేసింది. ఇంతకుముందు జరిగిన శిక్షణ శిబిరంలో రోహిత్, శుభ్‌మన్‌ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. గతంలో రోహిత్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఈ బాధ్యతలు పంచుకొనేవాడు. అతడిని ఓపెనర్‌గా లేదా ఐదో స్థానంలో వాడుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే, తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం నిరాశాజనకమే’’ అని మాజీ కోచ్ సంజయ్‌ బంగర్ వ్యాఖ్యానించాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని