Pakistan: ‘రమీజ్‌ రజా ఫిట్‌గా ఉన్నాడు.. కెప్టెన్‌ చేయండి’.. మంజ్రేకర్‌ చమత్కారం

పాకిస్థాన్‌ కెప్టెన్‌గా బాబర్ అజామ్‌ (Babar Azam) స్థానంలో ఆ దేశ మాజీ క్రికెటర్‌ రమీజ్ రాజాను నియమించాలంటూ టీమ్ఇండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ చమత్కరించాడు. 

Published : 18 Jun 2024 00:08 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ 2024 (T20 World Cup 2024)లో పాకిస్థాన్‌ పేలవ ప్రదర్శన చేసింది. టీమ్‌ఇండియా చేతిలో కంగుతిన్న పాక్‌.. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న అమెరికా చేతిలోనూ ఓడింది. ఫలితంగా కనీసం సూపర్‌-8కు చేరకుండా లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లపై సొంత దేశానికి చెందిన మాజీలతోపాటు ఇతర దేశాల క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆటగాడిగా, కెప్టెన్‌గా విఫలమైన బాబర్ అజామ్‌ (Babar Azam)పై తీవ్రంగా మండిపడుతున్నారు. అతడిని ఏకంగా జట్టు నుంచే తప్పించాలని పలువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ అజామ్‌ స్థానంలో మాజీ ఆటగాడు రమీజ్ రజా (Ramiz Raja)ను పాక్‌ కెప్టెన్‌గా నియమించాలని చమత్కరించాడు. 

‘‘వారు (పాకిస్థాన్‌ జట్టు) ఎప్పుడు కష్టాల్లో ఉన్న  రమీజ్ రాజా ఆదుకునేవాడు. ఈ సారి కూడా జట్టుకు సీఈవో అవుతాడేమో ఎవరికి తెలుసు? రమీజ్‌ రజా ఇంకా ఫిట్‌గా ఉన్నాడు. బాబర్ అజామ్ స్థానంలో అతడిని కెప్టెన్‌గా నియమించాలి’’ అని మంజ్రేకర్ చమత్కరించాడు. రమీజ్‌ రజా 2021 సెప్టెంబరు నుంచి 2022 డిసెంబర్‌ వరకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరించాడు. అతడు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో పాక్ జట్టు 2021 టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్స్‌, 2022 పొట్టి వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరింది. 1992లో పాకిస్థాన్‌ ప్రపంచ కప్‌ సాధించిన జట్టులో రమీజ్‌ సభ్యుడిగా ఉన్నాడు. అతడు ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ కామెంటెటరీ ప్యానల్‌లో ఉన్నాడు.  

పాక్‌ జట్టులో ఏం జరుగుతుందో చెప్పలేం: గావస్కర్‌ 

‘‘పాకిస్థాన్‌ జట్టులో ఏం జరుగుతుందో ఎప్పటికీ చెప్పలేం. ఆరు నెలల క్రితం వన్డే ప్రపంచ కప్‌లో బాబర్ అజామ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. తర్వాత అతడిని తొలగించారు. షహీన్ షా అఫ్రిది  రెండు, మూడు నెలలపాటు సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో న్యూజిలాండ్‌ పర్యటనలో జట్టు రాణించలేదు. అయితే మళ్లీ బాబర్ అజామ్‌ను కెప్టెన్‌గా చేయడం గమనార్హం’ అని సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు