ఆ నవ్వే.. నన్ను యువీ అభిమానిని చేసింది 

భారత క్రికెట్‌లో యువరాజ్‌సింగ్‌కు విశేషమైన అభిమానగణం ఉంది. తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టీమ్‌ఇండియాకు ఎన్నో ఒంటి చేతి విజయాలు అందించాడు...

Published : 27 Mar 2021 01:45 IST

మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత క్రికెట్‌లో యువరాజ్‌సింగ్‌కు విశేషమైన అభిమానగణం ఉంది. తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టీమ్‌ఇండియాకు ఎన్నో ఒంటి చేతి విజయాలు అందించాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి అత్యుత్తమ ఆటగాడికి తాను 2012లో అనుకోని పరిస్థితుల్లో అభిమానిని అయ్యానని అంటున్నాడు మాజీ క్రికెటర్‌, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌. అప్పుడు తాను యువీని విమర్శించినా అతడు మాత్రం చిరునవ్వుతోనే ఆకట్టుకున్నాడని చెప్పాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన మంజ్రేకర్‌ నాటి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.

2012 టీ20 ప్రపంచకప్‌లో యువీకి తుది జట్టులో చోటివ్వడం తనకిష్టం లేదని మంజ్రేకర్‌ చెప్పాడు. అప్పటికే క్యాన్సర్‌ నుంచి కోలుకున్న యువరాజ్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడని, దాంతో పొట్టి ప్రపంచకప్‌కు ఎంపిక చేయడం సరికాదని అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశానని గుర్తుచేశాడు. అయితే భావోద్వేగ పరిస్థితుల్లో యువీని ఎంపిక చేశారన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రపంచకప్‌లో యువీ ఒక మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడని, దాంతో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడని మంజ్రేకర్‌ తెలిపాడు.

‘‘మ్యాచ్‌ అనంతరం నేను వ్యాఖ్యాతగా ట్రోఫీల బహూకరణ జరుగుతోంది. ఆ సమయంలో యువీని చూసి కాస్త ఆందోళన చెందా. అంతకుముందు నేను చేసిన వ్యాఖ్యల పట్ల అతడు అసంతృప్తితో ఉన్నాడనుకున్నా. అతడిని ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు కోసం పిలిచినప్పుడు.. నన్ను చూస్తూ నవ్వుకుంటూ వచ్చాడు. అప్పుడు తనతో ‘నువ్వు ఈ జట్టులో ఉండడం కొంత మందికి ఇష్టం లేదు’’ అని చెప్పాను.

‘‘దానికి స్పందించిన యువరాజ్‌.. ‘అవును సర్‌. కొంత మంది ఇలా అన్నారని నేను కూడా విన్నా’నని చెప్పాడు. తర్వాత నన్ను చూసి నవ్వాడు. ఆ నవ్వును నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా విమర్శల్ని కూడా చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ఆ నవ్వులో ఏ మాత్రం ఎగతాళి లేదు. దాన్ని క్రీడాస్ఫూర్తితో తీసుకున్నాడు. అప్పుడు ఇంటర్వ్యూలో నాతో బాగా మాట్లాడాడు. ఆ తర్వాతే నేను యువరాజ్‌ను గౌరవించడం ప్రారంభించా. అతడికి అభిమానిగా మారాను’ అని మంజ్రేకర్‌ అసలు విషయం వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని