ధోనీలాగే కోహ్లీ నేర్చుకోవాలి: మంజ్రేకర్‌

క్రికెటర్ల గురించి బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌...

Published : 24 Mar 2021 02:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెటర్ల గురించి బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ తప్పుబట్టాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ సందర్భంగా కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడిపై విమర్శలొచ్చాయి. అనంతరం టీమ్‌ఇండియా సైతం ఐదో టీ20లో అతడిని ఆడించలేదు.

‘ఎవరైనా ఒక ఆటగాడు ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడినంత మాత్రాన.. అతడు ఆటను మర్చిపోయినట్లు కాదు. ఆ సమయంలో మానసిక స్పష్టత లోపించడమే కారణం. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఫామ్‌ కోల్పోయావ్‌.. ఇబ్బంది పడుతున్నావ్‌.. అని అతడితో అంటే ఇంకో అనవసర విషయాన్ని అతడి మదిలోకి తీసుకెళ్లినట్లు అవుతుంది. ఇదొక ఆట. బంతిని బాగా గమనించి తదనుగుణంగా షాట్లు ఆడాలి. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌ చేయాలి. అలాగే బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టీమ్‌ఇండియా వాటిని డ్రెస్సింగ్‌ రూమ్‌ వరకూ తీసుకురాదు. అదంతా నాన్‌సెన్స్‌’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

దీనిపై మంజ్రేకర్‌ తాజాగా స్పందించాడు. ఈ విషయంలో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని చూసి కోహ్లీ నేర్చుకోవాలని హితవు పలికాడు. ‘బయటి నుంచి వచ్చే విమర్శలను కోహ్లీ నాన్‌సెన్స్‌ అని కొట్టి పారేశాడు. అయితే అది ప్రజల స్పందన. క్రికెట్‌ అనేది జనాదరణ పొందిన ఆట. అదెప్పుడూ ఒకేలా ఉంటుంది. మీరు బాగా ఆడితే ప్రశంసిస్తారు. ఆడకపోతే విమర్శిస్తారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ నిజాన్ని.. ధోనీలాగే కోహ్లీ సంయమనంతో అర్థం చేసుకొని అంగీకరించాలి’ అని మంజ్రేకర్‌ ట్వీట్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని