sanju samson: ఇలాగైతే సంజూకి రిటైర్మెంట్‌ ఇప్పించండి.. బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో సైతం సంజూ శాంసన్‌కు చోటుదక్కకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 23 Nov 2022 01:07 IST

నేపియర్‌: న్యూజిలాండ్‌తో మూడో టీ20లో సైతం సంజూ శాంసన్‌కు చోటుదక్కకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాషింగ్టన్‌ సుందర్‌కు బదులుగా ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హర్షల్‌కు మాత్రమే చివరి మ్యాచ్‌లో అవకాశం లభించింది. ఆసీస్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు సైతం సంజూని ఎంపిక చేయలేదు. అయితే కివీస్‌తో టీ20 సిరీస్‌ జట్టులో మాత్రం అతడి పేరును ప్రకటించారు. కానీ, ఎంతో ప్రతిభ ఉన్న ఈ ఆటగాడికి  ఈ అవకాశం కూడా దూరం చేశారంటూ అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

ఇటీవల ఇదే విషయంపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘రెండు మ్యాచుల్లో ఆడించి పక్కన పెట్టడం సరికాదు. అతడికి మంచి అవకాశాలు ఇవ్వండి. కనీసం పది మ్యాచులు ఆడనివ్వండి. ఆ తర్వాత అతడితో ఆడించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోండి’’ అంటూ పేర్కొన్నాడు.  అభిమానులు సైతం టీమ్ మ్యానేజ్‌మెంట్‌ రాజకీయాలు చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు. రవిశాస్త్రి చెప్పింది నిజమేనంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘‘అతడికి టీమ్‌ఇండియా తరఫున అవకాశం ఇవ్వకపోయినా ఫరవాలేదు. కానీ, బీబీఎల్‌ వంటి ఇతర లీగ్‌ల్లో అయినా ఆడేందుకు అనుమతి ఇవ్వండి. లేదా రిటైర్మెంట్ అవకాశం ఇవ్వండి. అంతేగానీ ఈ ఆటగాడి భవిష్యత్తుతో ఆడుకోవద్దు. మీ ఫేవరెట్‌ ఆటగాళ్లు పంత్‌, ఇషాన్‌, దీపక్‌ హుడా.. వంటి వాళ్లలా కాకుండా మేం అతడిని గొప్ప క్రికెటర్‌గా చూడాలనుకుంటున్నాం’’ అంటూ ఓ అభిమాని ట్విటర్‌లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. 










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని