Sanju Samson: పడిక్కల్‌ ఉన్నా.. అశ్విన్‌ను పంపింది అందుకే..: సంజూ

ఓపెనర్‌గా అశ్విన్‌ (Ravichandran Ashwin)ను పంపించి రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) చేసిన ప్రయోగం ఫలించలేదు. అయితే దీని వెనుక కారణాన్ని ఆ జట్టు కెప్టెన్‌ సంజూ శాంసన్‌ వెల్లడించాడు.

Published : 06 Apr 2023 13:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ (IPL) సీజన్‌ 16లో రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) తొలి ఓటమిని ఖాతాలో వేసుకుంది. గత రాత్రి పంజాబ్‌ (PBSK)తో జరిగిన మ్యాచ్‌ను తృటిలో కోల్పోయింది. అశ్విన్‌ను ఓపెనర్‌గా దించుతూ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దీనిపై రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) స్పందించాడు. మధ్య ఓవర్లలో లెఫ్టార్మ్‌ బ్యాట్స్‌మన్‌ అవసరం వల్లే.. అశ్విన్‌ (Ravichandran Ashwin)ను ముందు పంపించాల్సి వచ్చిందని తెలిపాడు. (RR vs PBSK)

‘‘ఫీల్డిండ్‌లో క్యాచ్‌ అందుకునే సమయంలో బట్లర్‌ (Jos Buttler) చేతి వేలికి గాయమైంది. వేలికి స్టిచ్‌ వేయాల్సి వచ్చింది. తర్వాత మా ఇన్నింగ్స్‌ ఆరంభమయ్యే సమయానికి బట్లర్‌ పూర్తిగా ఫిట్‌గా లేడు. అయితే దేవదత్ పడిక్కల్‌కు ఓపెనర్‌గా దిగిన అనుభవం ఉంది. కానీ, ప్రత్యర్థి జట్టులో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ (హర్‌ప్రీత్ బ్రార్‌), లెగ్‌స్పిన్నర్‌ (రాహుల్ చాహర్‌) ఉన్నారు. వారు మధ్య ఓవర్లలో బౌలింగ్‌ చేస్తారని మాకు తెలుసు. ఆ సమయంలో లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్స్‌మన్‌ ఉండటం మాకు ముఖ్యమనిపించింది. అందుకే యశస్వితో కలిసి అశ్విన్‌ను ఓపెనర్‌గా పంపించి పడిక్కల్‌ను నాలుగులో దింపాం’’ అని సంజూ (Sanju Samson)చెప్పాడు. అయితే ఈ ప్రయోగం ఫలించలేదు. అర్ష్‌దీప్‌ తన వరుస ఓవర్లలో యశస్వి (11), అశ్విన్‌ (0)ను పెవిలియన్‌ చేర్చాడు. మూడో స్థానంలో వచ్చిన బట్లర్‌ (19) నిరాశపర్చాడు.

ఒక హిట్‌ దూరంలో ఆగిపోయాం..

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ (RR) కేవలం 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీనిపై సంజూ స్పందిస్తూ.. ‘‘మేం ఉత్తమంగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించాం. అయితే మధ్య ఓవర్లలో కాస్త నెమ్మదించాం. అక్కడ బౌండరీలు చేయాల్సింది. అయినప్పటికీ నిలదొక్కుకుని విజయానికి సమీపంగా వచ్చాం. కానీ ఒక్క సిక్స్‌ దూరంలో ఆగిపోయాం’’ అని సంజూ వివరించాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని