Updated : 28 May 2022 10:52 IST

Sanju Samson: టాస్‌ గెలవడం మ్యాచ్‌ గెలవడానికి దోహదం చేసింది: సంజూ

(Photo: Sanju Samson Instagram)

అహ్మదాబాద్‌: బెంగళూరుతో జరిగిన క్వాలిఫయర్‌-2లో టాస్ గెలవడం మ్యాచ్‌ గెలవడానికి దోహదం చేసిందని రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ పేర్కొన్నాడు. గతరాత్రి జరిగిన ఈ కీలక పోరులో రాజస్థాన్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లో చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన రాజస్థాన్‌ కెప్టెన్‌ ‘తొలి క్వాలిఫయర్‌లో ఓటమిపాలయ్యాక ఇలా తిరిగి బలంగా పుంజుకోవడం సంతోషంగా ఉంది. భారత టీ20 లీగ్‌లో ఇలాంటి ఒడుదొడుకులు సహజమే. లీగ్‌ స్టేజ్‌లోనూ మేం కొన్ని మ్యాచ్‌లు ఓడిపోయాం, దాంతో తిరిగి ఎలా బలంగా పుంజుకోవాలో మాకు తెలిసింది’ అని పేర్కొన్నాడు.

‘ఈ పిచ్‌ కాస్త నెమ్మదిగా ఉండటంతో ఫాస్ట్‌ బౌలర్లకు కలిసొచ్చింది. అలాగే స్పిన్నర్లపై చెలరేగడానికి కూడా సహకరించింది. ఈ క్రమంలోనే బెంగళూరును తొలి ఇన్నింగ్స్‌లో బాగా కట్టడి చేశాం. ఆ జట్టులో దినేశ్‌ కార్తీక్‌, మాక్స్‌వెల్‌ లాంటి హిట్టర్లు ఎంత ప్రమాదకరమో మాకు తెలుసు. మా బౌలింగ్‌పై పూర్తి నమ్మకం ఉంచి వాళ్లని నిలువరించాం. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలవడం మ్యాచ్‌ గెలవడానికి దోహదపడింది. ఏ మ్యాచ్‌లో అయినా టాస్‌ కీలకంగా వ్యవహరిస్తుంది. ఈరోజు పిచ్‌.. తొలి ఇన్నింగ్స్‌కి, రెండో ఇన్నింగ్స్‌కి పూర్తిగా మారిపోయింది. మెకాయ్‌కు ఇది తొలి సీజనే అయినా చాలా ప్రశాంతంగా బౌలింగ్‌ చేశాడు. అలాగే జోస్‌ బట్లర్‌ లాంటి ఆటగాడు ఉండటం మాకెంతో కలిసొచ్చింది. అతడు ఆడే విధానం గొప్పగా ఉంది. మేం ఇంకా ఒక్క మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. అక్కడ కూడా ఇలాంటి ప్రదర్శనతోనే విజయం సాధిస్తామని ఆశిస్తున్నా. ఇక ఈ టోర్నీలో తొలి సీజన్‌ విజేతగా రాజస్థాన్‌ నిలిచినప్పుడు నేను అండర్‌-16 స్థాయిలో క్రికెట్‌ ఆడేవాడిని. అప్పుడు ఫైనల్‌ మ్యాచ్‌లో షేన్‌వార్న్‌, సోహైల్‌ తన్వీర్‌ చివరి పరుగు తీసి విజయ సంబరాలు చేసుకోవడం నాకింకా గుర్తుంది. నేను కూడా అలాంటి విజయం సాధించాలనుకుంటున్నా’ అని శాంసన్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని