Team India: ‘సాహా విషయంలో ద్రవిడ్‌ తప్పుగా ఏం చెప్పలేదు’

టీమ్‌ఇండియా క్రికెట్‌లో ఇప్పుడు ప్రధాన చర్చంతా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గురించే సాగుతోంది. అతడి విషయంలో గతవారం రెండు కీలక విషయాలు చోటుచేసుకోవడంతో వార్తల్లో నిలిచాడు...

Published : 24 Feb 2022 12:13 IST

మాజీ సెలెక్టర్‌ శరణ్‌దీప్‌ సింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా క్రికెట్‌లో ఇప్పుడు ప్రధాన చర్చంతా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గురించే సాగుతోంది. అతడి విషయంలో గతవారం రెండు కీలక విషయాలు చోటుచేసుకోవడంతో వార్తల్లో నిలిచాడు. అయితే, అందులో ఒకటి  శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు తనని ఎంపిక చేయని నేపథ్యంలో అందుకు దారితీసిన పరిణామాలను సాహా మీడియాకు చెప్పుకొచ్చాడు. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనని రిటైర్మెంట్‌ గురించి ఆలోచించమని సూచించినట్లు వెల్లడించాడు. దీనిపై ద్రవిడ్‌ సైతం తన అభిప్రాయాలను బహిరంగంగానే వివరించాడు. సాహాకు తాను చెప్పింది నిజమేనని ఒప్పుకొన్నాడు.

ఇక ఈ విషయంపై తాజాగా మాజీ సెలెక్టర్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ స్పందించాడు. అందులో ద్రవిడ్‌ తప్పుగా ఏదీ మాట్లాడలేదని పేర్కొన్నాడు. ఇప్పుడు 37 ఏళ్లు ఉన్న సాహా తన గురించి తాను ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. అతడిని టీమ్‌ఇండియాకు ఎంపిక చేసినా తుది జట్టులో ఉండే అవకాశం లేదని, అలాంటప్పుడు అతడిని ఎంపిక చేయడం ఎందుకని ప్రశ్నించాడు. మరోవైపు యువ కీపర్లు సైతం అందుబాటులో ఉన్నప్పుడు సాహా రిజర్వ్‌బెంచ్‌లో కూర్చోవాల్సిన అవసరం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీమ్‌ఇండియాకు ఇప్పుడు రిషభ్‌ పంత్ తొలి ప్రాధాన్యం అని, దీర్ఘకాలం అతడు జట్టులో కొనసాగుతాడని శరణ్‌దీప్‌ అభిప్రాయపడ్డాడు. అలాగే అతడిని ఇంటర్వ్యూ కోసం బెదిరించిన జర్నలిస్టు పేరు కూడా వెల్లడించాలని మాజీ క్రికెటర్‌ పేర్కొన్నాడు. అయితే, సాహ.. సదరు పాత్రికేయుడు పేరు బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదు. ఈ విషయంపై బీసీసీఐ సంప్రదించినా అతడి పేరు చెప్పలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే శరణ్‌దీప్‌.. ఆ జర్నలిస్టు పేరు బయటపెట్టాలని కోరాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని