IND vs PAK: విరాట్‌ సమాధానంతో ఆశ్చర్యపోయా.. నేను మాత్రం అలా ముగించా: సర్ఫరాజ్‌

భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ ఉంటే క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ తీవ్ర స్థాయిలో ఉంటుంది. మరి ఆటగాళ్లలో ఎలా ఉంటుంది..? దీనికి భారత మాజీసారథి విరాట్ కోహ్లీ సమాధానం ఇచ్చిన విధానం ఆశ్చర్యానికి గురి చేసిందని పాక్‌ అప్పటి కెప్టెన్ సర్ఫరాజ్‌అహ్మద్‌ వ్యాఖ్యానించాడు.

Updated : 31 Mar 2023 14:29 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీతో (Virat Kohli) జరిగిన ఓ సంఘటనను పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ భారత జట్టుకు విరాట్ కోహ్లీ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. పాక్‌కు సర్ఫరాజ్‌అహ్మద్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. టోర్నీకి ముందు అన్ని జట్ల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌ -పాక్‌ మ్యాచ్‌పై విలేకర్లు ప్రశ్నలు సంధించారు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం సుదీర్ఘంగా సమాధానం ఇవ్వగా.. సర్ఫరాజ్‌ మాత్రం కేవలం ఆరు పదాల్లోనే ముగించేశాడట. 

‘‘భారత్ - పాక్‌ జట్ల (IND vs PAK) మధ్య మ్యాచ్‌లకు హైప్‌ ఎందుకు ఉంటుంది..? అభిమానులు టికెట్ల గురించి అడిగితే మీరు ఎలా స్పందిస్తారు..? అని మమ్మల్ని అడిగారు. తొలుత విరాట్‌ను అడగండని నేను చెప్పా. బ్రదర్ తొలుత నువ్వు సమాధానం ఇవ్వొచ్చుగా అని విరాట్‌ను అడిగా. ఇక విరాట్ కోహ్లీ సమాధానం ఇవ్వడం ప్రారంభించాడు. అలాగే కొనసాగుతూ ఉన్నాడు. దీంతో నేను సదరు విలేకరి వైపు తిరిగి.. అతడు (విరాట్) ఎప్పుడు ఆగుతాడు? అని అడిగా. ఎందుకంటే కోహ్లీ పెద్ద పదాలతో ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నాడు. దీంతో ఇదంతా ఇప్పుడు ఎవరు ట్రాన్స్‌లేట్‌ చేస్తారు? అని  ఆ సమయంలో అనుకున్నా.  చివరికి నేను కూడా ‘నా సమాధానం కూడా అదే’అని చెప్పేశా. ఎంతో తేలికైన ప్రశ్న కదా.. ఎందుకు విరాట్ అంత భారీ సమాధానం ఇచ్చాడని ఆలోచించా’’ అని సర్ఫరాజ్‌ తెలిపాడు. 

విరాట్ సమాధానం ఇదీ..

దాయాదుల పోరుపై ఉత్కంఠను ఎలా చూస్తారనే ప్రశ్నకు విరాట్ కోహ్లీ ఇచ్చిన సమాధానం ఏంటంటే.. ‘‘భారత్, పాక్‌ మ్యాచ్‌ అంటే ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. అభిమానులు చూసే దృష్టికోణానికి మేం (ఆటగాళ్లం)  చూసే విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మైదానంలోకి అడుగు పెట్టేవరకే భావోద్వేగంతో ఉంటాం. ఎప్పుడైతే మ్యాచ్‌ కోసం బరిలోకి దిగుతామో ప్రొఫెషనల్‌ గేమ్ ఆడేందుకు మాత్రమే ప్రయత్నిస్తాం. బౌలర్లు, బ్యాటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. ఇతర జట్లతో ఆడినట్లే భావించి మరీ బరిలోకి దిగుతాం. అయితే, స్టేడియంలోని అభిమానుల కేరింతలు, అరుపులు మాపై కొంత ఒత్తిడి తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. ఇరు జట్ల సభ్యులం ఇలాగే ఫీల్‌ అయి మ్యాచ్‌ ఆడతాం’’ అని కోహ్లీ చెప్పాడు. చివరికి సర్ఫరాజ్‌ కూడా ‘‘నా సమాధానం కూడా అదే’ అని బదులిచ్చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని