ARG vs KSA: ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సికి షాక్‌.. అర్జెంటీనాపై సౌదీ సంచలన విజయం

ఫిఫా ప్రపంచకప్‌లో సౌదీ అరేబియా సంచలనం నమోదు చేసింది. పటిష్టమైన అర్జెంటీనా ఓడించిది. స్టార్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సి గోల్‌ చేసినా తన జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. 

Updated : 23 Nov 2022 07:37 IST

(ఫొటో సోర్స్: ఫిఫా వరల్డ్‌ కప్ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. స్టార్‌ ప్లేయర్‌ లియోనెల్ మెస్సి నాయకత్వంలోని అర్జెంటీనాను సౌదీఅరేబియా మట్టికరిపించింది. దాదాపు 88 వేలకుపైగా హాజరైన జనసందోహంలో సౌదీ అరేబియా 2-1 తేడాతో అర్జెంటీనాను ఓడించింది. దీంతో సౌదీ అరేబియా అభిమానులు ‘‘మెస్సి ఎక్కడ..? మేం అతడిని ఓడించాం’’.. ‘‘మా జట్టు మా కలలను నెరవేర్చింది’’ అంటూ ఆనందంతో సంబరాలు జరిపారు. 

సౌదీ గోల్‌కీపర్‌ ఆల్‌ ఓవైస్‌ ఈ మ్యాచ్‌లో హీరో. అర్జెంటీనా ఆటగాళ్లు గోల్‌పోస్టు వైపు కొట్టిన బంతులను అద్భుతంగా అడ్డుకొన్నాడు. ఆట ప్రారంభమైన పదో నిమిషంలోనే పెనాల్టీ రూపంలో వచ్చిన అవకాశాన్ని మెస్సి గోల్‌గా మలిచాడు. తొలి అర్ధ భాగంలో అర్జెంటీనా ఆటగాళ్లు పదేపదే గోల్‌పోస్టు వైపు దూసుకెళ్లారు. అయితే సౌదీ గోల్‌కీపర్ సమర్థంగా అడ్డుకొన్నాడు. ఆ తర్వాత రెండో అర్ధభాగంలో సౌదీ అరేబియా దాడి మొదలుపెట్టింది. 48వ నిమిషంలోనే సలేహ్‌ ఆల్‌ షెహ్రి, 53వ నిమిషంలో సలీమ్‌ ఆల్‌ డాసరి గోల్స్‌ చేసి అర్జెంటీనాను కంగుతినిపించారు. మ్యాచ్‌ ముగిశాక మెస్సి షాక్‌కు గురై అలాగే కాసేపు ఉండిపోయాడు. 

దీంతో వరుసగా 36 మ్యాచుల్లో అజేయంగా నిలిచిన అర్జెంటీనా.. ఇటలీ రికార్డును (37) అధిగమించడంలో విఫలమైంది. అయితే 1990 ప్రపంచకప్‌ సందర్భంగా దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా సారథ్యంలోని అర్జెంటీనా కూడా తన తొలి మ్యాచ్‌లో కామెరూన్‌ చేతిలో (1-0) ఓటమిపాలైంది. అయితే ఆ సీజన్‌లో అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకెళ్లి రన్నరప్‌గా నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని