BCCI: గంగూలీ, షా కొనసాగింపుపై ఉత్కంఠ.. వచ్చేవారం సుప్రీం విచారణ

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, సెక్రటరీ జై షాల పదవీకాలం పొడగింపు అంశంపై వచ్చేవారం స్పష్టత వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీసీసీఐ రాజ్యాంగ సవరణపై వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని

Published : 15 Jul 2022 16:20 IST

దిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, సెక్రటరీ జై షాల పదవీకాలం పొడిగింపు అంశంపై వచ్చేవారం స్పష్టత వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీసీసీఐ రాజ్యాంగ సవరణపై వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చేవారం దీనిపై విచారణ జరుపుతామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

జస్టిస్‌ ఆర్‌ఎం. లోధా కమిటీ సిఫార్సుల మేరకు ఎవరైనా బీసీసీఐ లేదా రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్ పాలకమండలిలో కొనసాగాలంటే గరిష్ఠంగా ఆరేళ్లకు మించి పని చేయకూడదు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే మధ్యలో 3 ఏళ్ల విరామం (కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌) తప్పని సరి అనే నిబంధన ఉంది. అయితే ఈ కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ను తొలగిస్తూ 2019 డిసెంబరులో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రతిపాదనలు చేశారు. కొత్త ప్రతిపాదనలతో పాలకమండలిలోనూ సభ్యులు ఆరేళ్లు దాటినా ఆ పదవిలో కొనసాగేందుకు వీలుంటుంది. అంటే గంగూలీ, జైషా మరికొంత కాలం తమ పదవుల్లో ఉండేందుకు మార్గం సుగమమవుతంది. ఈ ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు అనుమతి కోరుతూ 2020 ఏప్రిల్‌లో బీసీసీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే కరోనా కారణంగా విచారణకు రాలేదు. దీంతో అత్యవసర విచారణ చేపట్టాలంటూ బీసీసీఐ శుక్రవారం కోర్టును అభ్యర్థించగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది.

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరభ్‌ గంగూలీ 2019 అక్టోబరులో ఈ బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటికే ఆయన బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో సుదీర్ఘకాలం పనిచేశారు. అటు సెక్రటరీ జై షా కూడా గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో పనిచేశారు. వీరిద్దరి పదవీకాలం 2020 జులైలోనే ముగిసింది. ఈ క్రమంలోనే కూలింగ్‌ పీరియడ్‌ను తొలగిస్తూ చేసిన రాజ్యాంగ సవరణలపై బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ప్రస్తుతం ఆ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీంతో వీరిద్దరూ ఇప్పటికీ తమ పదవుల్లో కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని