
T20 World Cup 2021: దంచికొట్టిన గప్తిల్.. స్కాట్లాండ్ ముందు భారీ లక్ష్యం
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. స్కాట్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బ్యాటర్లలో మార్టిన్ గప్తిల్ (93: 56 బంతుల్లో 4x6, 6X7) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. స్కాట్లాండ్ బౌలర్లలో సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లే వీల్ రెండేసి, మార్క్ వాట్ ఒక వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. సఫ్యాన్ షరీఫ్ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి ఓపెనర్ డెరిల్ మిచెల్ (13) వికెట్ల ముందు దొరకగా.. ఐదో బంతికి కేన్ విలియమ్సన్ (0) కీపర్‌కి చిక్కాడు. దీంతో న్యూజిలాండ్ ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డెవాన్ కాన్వే (1) విఫలమయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతున్న మరో ఓపెనర్ మార్టిన్ గప్తిల్.. గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే క్రిస్ గ్రీవ్స్ వేసిన 13వ ఓవర్లో భారీ సిక్సర్‌తో గప్తిల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత గేర్ మార్చిన అతడు ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే బ్రాడ్లే వీల్ వేసిన 18.2 బంతికి గ్లెన్ ఫిలిప్స్ (33) ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే శతకం దిశగా సాగుతున్న గప్తిల్ కూడా ఔటయ్యాడు. ఆఖర్లో వచ్చిన జేమ్స్ నీషమ్ (10), మిచెల్ సాంట్నర్ (2) నాటౌట్‌గా నిలిచారు.