Scott Styris: భవిష్యత్తులో అతడిని టీమ్‌ఇండియా కెప్టెన్‌గా చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు: స్కాట్‌ స్టైరిస్

భారత క్రికెట్‌లో కెప్టెన్సీ చర్చ ఇటీవల జోరుగా సాగుతోంది

Published : 12 Aug 2022 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్‌లో కెప్టెన్సీ చర్చ ఇటీవల జోరుగా సాగుతోంది. దీనికి గల కారణాలు లేకపోలేదు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏడుగురు కెప్టెన్లు భారత జట్టును నడిపించారు. దీంతో రోహిత్‌ వారసుడిగా పూర్తిస్థాయి సారథిని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్య ముందున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, వీరిలో పాండ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఈ మధ్యకాలంలో వార్తలొచ్చాయి. ఎందుకంటే భారత టీ20లీగ్‌లో గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన హార్దిక్‌.. ఆ తర్వాత భారత జట్టు తరఫున ఐర్లాండ్‌ సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తాజాగా విండీస్‌తో జరిగిన చివరి టీ20లోనూ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఐతే ఆసియాకప్‌కు మాత్రం రాహుల్‌ని వైస్‌కెప్టెన్‌గా నియమించడంతో భవిష్యత్‌ సారథిగా హార్దిక్‌కి అవకాశం ఇస్తారా? లేదా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్కాట్‌ స్టైరిస్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 

స్టైరిస్ ఓ క్రీడా ఛానెల్‌లో మాట్లాడుతూ ‘‘ఇది చమత్కారమైన చర్చ. ఎందుకంటే ఆరు నెలలు క్రితం మనమంతా హార్దిక్‌  గురించి మాట్లడతామని అనుకోలేదు. కానీ హార్దిక్ ఇప్పుడు ఛాంపియన్‌. మీరు ఫుట్‌బాల్‌లో చూసే ఉంటారు..  ఎక్కువ సందర్భాల్లో నైపుణ్యం, వ్యక్తిత్వం ఉన్న ఆటగాళ్లకు కెప్టెన్సీ ఇచ్చి అతడికి జట్టును నడిపించే బాధ్యత అప్పగిస్తారు. ప్రస్తుతం టీమ్‌ ఇండియా టీ20 క్రికెట్‌ ఆడే విధానాన్ని చూస్తే హార్దిక్‌పాండ్య లాంటి ఆట, వ్యక్తిత్వం ఉన్న ప్లేయర్‌కి అవకాశాలు రావొచ్చు. కాబట్టి ఆసియాకప్‌లో కాకపోయినా, భవిష్యత్తులో మనం హార్దిక్‌ని కెప్టెన్‌గా చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని స్టైరిస్ చెప్పాడు. అవకాశం ఇస్తే సారథ్య బాధ్యతలు స్వీకరిస్తానని పాండ్య ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని