Zim vs Ind : నిన్నటిలా రాణించాలి.. రేపు సిరీస్‌ విజేతగా నిలవాలి

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను టీమ్ఇండియా ఘనంగా ప్రారంభించింది. గురవారం జరిగిన తొలి వన్డేలో పది వికెట్ల తేడాతో....

Updated : 19 Aug 2022 18:23 IST

జింబాబ్వే, భారత్‌ జట్ల మధ్య శనివారం రెండో వన్డే

ఇంటర్నెట్ డెస్క్‌: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను టీమ్ఇండియా ఘనంగా ప్రారంభించింది. గురవారం జరిగిన తొలి వన్డేలో పది వికెట్ల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. శనివారం హరారే వేదికగానే జింబాబ్వే-భారత్ జట్ల మధ్య రెండో మ్యాచ్‌ జరగనుంది. ఇందులోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా జింబాబ్వే పుంజుకోవడం ఖాయం. బంగ్లాదేశ్‌తో జింబాబ్వే పోరాటం మరిచిపోకూడదు. 

తొలి వన్డేలో భారత బౌలర్లు, ఓపెనర్లు అద్భుతంగా రాణించినా.. జింబాబ్వే లోయర్‌ఆర్డర్‌ను కంట్రోల్‌ చేయడంలో మాత్రం కాస్త విఫలమైనట్లు ఉంది. కెప్టెన్‌ చకబ్వాతోపాటు సికిందర్‌ రజాను త్వరగానే పెవిలియన్‌కు చేర్చారు. అయితే తొమ్మిదో వికెట్‌కు బ్రాడ్ ఇవాన్స్‌-ఎన్‌గరవ 70 పరుగులు జోడించడం విశేషం. భారత బౌలర్లు ఆరంభంలో ఉన్న పట్టును విడిపించారు. లేకపోతే తొలి వన్డేలో జింబాబ్వే 150 పరుగుల్లోపే కుప్పకూలాల్సింది. దీంతో ఆఖరికి 189 పరుగులకు ఆలౌటై.. కాస్త గౌరవప్రదమైన స్కోరును భారత్‌కు లక్ష్యంగా నిర్దేశించింది. 

కుల్‌దీప్‌ ఒక్కడే.. 

చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన దీపక్‌ చాహర్‌ (3/27) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ప్రసిధ్‌ (3/50) పరుగులు ఎక్కువ ఇచ్చినా వికెట్లు తీశాడు. ఇక అక్షర్‌ అయితే (3/24) కీలక సమయంలో వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరాజ్‌ ఒక వికెట్‌ మాత్రమే తీసి కాస్త నిరుత్సాహపరిచాడు. అయితే కుల్‌దీప్‌ (10-1-36-0) యాదవ్‌ మాత్రం వికెట్ తీయడంలో ఇబ్బందిపడ్డాడు. కానీ పరుగులను నియంత్రించడం ఒక్కటే ఊరట. కానీ రెండో  వన్డేలోనైనా వికెట్లను పడగొట్టి తన సత్తాను నిరూపించుకోవాలి. కీలక టోర్నీల్లో జట్టులో స్థానం దక్కాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ రాణించాల్సిందే. 

బ్యాటింగ్‌ ఓకే.. మరి

మొదటి వన్డేలో భారత ఓపెనర్లే 190 పరుగుల లక్ష్యాన్ని ఊదేశారు. దీంతో మిగతావారికి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. గాయం నుంచి కోలుకుని టీమ్‌ సారథ్య బాధ్యతలను చేపట్టిన కేఎల్‌ రాహుల్‌ ఎలా ఆడతాడనేది చూడాలంటే వేచి చూడాల్సిందే. సంజూ శాంసన్, ఇషాన్‌ కిషన్‌ కూడా రెండో వన్డేలో అవకాశం వస్తే మాత్రం ఏమాత్రం చేజారనీయకూడదు. మరో రెండు నెలల్లో  పొట్టి ప్రపంచకప్‌ నేపథ్యంలో ఫిట్‌నెస్‌తోపాటు ఫామ్‌ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. టీమ్‌ఇండియా ఓపెనర్లు కూడా తొలి వన్డే ఆటనే కొనసాగించాలి. శిఖర్ ధావన్‌, శుభ్‌మన్ గిల్ వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తే  ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు ఒత్తిడి లేకుండా ఆడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని