NZ vs IND: రెండో వన్డే వరుణుడిదే.. భారత్‌కు కలిసిరాని వాతావరణం.. 1-0 ఆధిక్యంలో కివీస్

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ వర్షం కారణంగా తుడిచిపెట్టుకొనిపోయింది. టీమ్ఇండియా ఇన్నింగ్స్ 12.5 ఓవర్ల వద్ద భారీగా వర్షం రావడంతో మ్యాచ్‌ నిర్వహించేందుకు వాతావరణం అనుకూలంగా లేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

Updated : 27 Nov 2022 13:02 IST

హామిల్టన్: భారత్- న్యూజిలాండ్‌ జట్ల మధ్య హామిల్టన్‌ వేదికగా రెండో వన్డే మ్యాచ్‌లో వరుణుడు విజయం సాధించాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచే అప్పుడప్పుడు పలకరిస్తూ వచ్చిన వర్షం.. భారత ఇన్నింగ్స్‌ 12.5 ఓవర్ల వద్ద భారీగా కురవడంతో మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు తేల్చేశారు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆటను రద్దు చేసే సమయానికి భారత్‌ 12.5 ఓవర్లలో 89/1 స్కోరుతో నిలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి వన్డేలో కివీస్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం (నవంబర్ 30) క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగే చివరి వన్డే కీలకం కానుంది. ఆ మ్యాచ్‌లో కివీస్‌ గెలిస్తే సిరీస్‌  ఆ దేశం సొంతమవుతుంది. భారత్ విజయం సాధిస్తే మాత్రం సిరీస్‌ 1-1తో సమమవుతుంది.


వర్షం మళ్లీ అంతరాయం

మరోసారి వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో 12.5 ఓవర్ల వద్ద ఆటను అంపైర్లు నిలిపేశారు. అంతకుముందు ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ (3) త్వరగానే ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌ (34*)తో కలిసి మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (45*) భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అర్ధశతక (66) భాగస్వామ్యం నిర్మించారు. ప్రస్తుతం భారత్‌ స్కోరు 12.5 ఓవర్లకు 89/1. వర్షం కారణంగా మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. అయితే మధ్యాహ్నం 1.05 గంటల్లోగా మ్యాచ్‌ ప్రారంభం కాకపోతే రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి.


ఆట పునఃప్రారంభం

వరుణుడు అడపాదడపా అంతరాయం కలిగించినప్పటికీ.. మ్యాచ్‌ 29 ఓవర్లకు కుదించి ఆటను ప్రారంభించారు. ఆటను ఆపే సమయానికి 4.5 ఓవర్లలో 22/0 స్కోరుతో ఉన్న భారత్‌కు రెండోబంతికే షాక్ తగిలింది. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన శిఖర్ ధావన్ (3) మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో (5.1వ ఓవర్‌) ఫెర్గూసన్ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 23 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజ్‌లో శుభ్‌మన్ గిల్ (29*)తోపాటు వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్‌యాదవ్ (3*) ఉన్నాడు. 


29 ఓవర్లకు కుదింపు

వర్షం తగ్గిపోయింది. భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకొన్నారు.  ఇన్నింగ్స్‌ బ్రేక్‌ను కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అలాగే డ్రింక్స్‌ బ్రేక్ ఉండదు. ప్రస్తుతం భారత్ 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. దీంతో మరో 24.1 ఓవర్లను టీమ్‌ఇండియా ఆడనుంది. క్రీజ్‌లో శుభ్‌మన్ గిల్ (19*), ధావన్ (2*) ఉన్నారు. 


మళ్లీ వచ్చేశాడు..

క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్. మరోసారి వరుణుడు ఆటంకం కలింగించేందుకు వచ్చేశాడు. ఇంతకుముందు వర్షం తగ్గడంతో ఊపిరి పీల్చుకొన్న అభిమానులు ఢీలాపడ్డారు. పిచ్‌ను కవర్లతో కప్పేశారు. ఇప్పటికే దాదాపు మూడు గంటల సమయం వృథా అయిపోయింది. ఒకవేళ మ్యాచ్‌ ఆరంభమైనప్పటికీ ఓవర్లను కుదించడం ఖాయం. మధ్యాహ్నం 12.34 గంటల్లోపు మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉంటుంది. లేకపోతే మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశం ఉంది.


తగ్గిన వర్షం 

భారత్‌-కివీస్‌ రెండో వన్డేకు ఆటంకం కలిగించిన వర్షం తెరిపినిచ్చింది. దీంతో స్టేడియాన్ని సిద్ధం చేసేందుకు సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే కనీసం అరగంటకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొన్ని ఓవర్ల ఆటను కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం భారత్‌ స్కోరు 4.5 ఓవర్లలో 22/0. క్రీజ్‌లో ధావన్ (2*), గిల్ (19*) ఉన్నారు.


వర్షం అంతరాయం
 

భారత్, న్యూజిలాండ్‌ రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను నిలిపేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా వర్షం కారణంగా ఆటను ఆపేసే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (2*) మరీ నెమ్మదిగా ఆడుతుండగా.. శుభ్‌మన్ గిల్ (19*) కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నాడు.


టాస్‌ నెగ్గిన కేన్

వన్డే సిరీస్‌ రేసులో నిలవాలంటే భారత్‌ తప్పక నెగ్గాల్సిందే. తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యం నిర్దేశించినా ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో హామిల్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో తలపడుతోంది. టాస్‌ నెగ్గిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌ ఎంచుకొన్నాడు. వర్షం ప్రభావం కారణంగా హామిల్టన్ మైదానం కాస్త చిత్తడిగా మారింది. దీంతో టాస్‌ ఆలస్యమైంది. సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్‌కు బదులు దీపక్ హుడా, దీపక్ చాహర్‌ జట్టులోకి వచ్చారు. స్వదేశంలో వరుసగా 13 వన్డేలు గెలిచిన కివీస్‌ను అడ్డుకోవడం భారత్‌కు సులువేం కాదు. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా.. బౌలింగ్‌లో టీమ్‌ఇండియా తేలిపోయింది. తొలి మ్యాచ్‌లోనూ కేన్ టాస్‌ గెలిచిన విషయం తెలిసిందే.

జట్ల వివరాలు: 

భారత్: శిఖర్ ధావన్‌ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్‌ పంత్, సూర్యకుమార్‌, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్‌ సింగ్, యుజ్వేంద్ర చాహల్‌

న్యూజిలాండ్‌: ఫిన్ అలెన్, డేవన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్‌ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైకెల్ బ్రాస్‌వెల్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని