Updated : 27 May 2022 07:03 IST

Rajasthan Vs Bangalore : రాజస్థాన్‌ రాజసమా.. బెంగళూరు ప్రతాపమా?

 రెండో క్వాలిఫయర్‌ నేడే

రాత్రి 7.30 నుంచి

అహ్మదాబాద్‌

టీ20 లీగ్‌ చివరి అంకంలో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. మేటి బ్యాట్స్‌మెన్‌కు, నాణ్యమైన బౌలర్లకు నెలవైన రెండు జట్ల మధ్య రెండో క్వాలిఫయర్‌ పోరు శుక్రవారమే. తొలి క్వాలిఫయర్‌లో పోరాడి ఓడిన రాజస్థాన్‌ ఎలిమినేటర్‌లో కష్టం మీద గట్టెక్కిన బెంగళూరు ఫైనల్‌ బెర్తు కోసం అహ్మదాబాద్‌లో తలపడబోతున్నాయి. మరి టైటిల్‌ పోరులో గుజరాత్‌ను ఢీకొనబోయే జట్టేదో?

తొలి క్వాలిఫయర్‌లో పెద్ద స్కోరు చేసినా, గుజరాత్‌ జోరు ముందు నిలవలేక ఓటమి చవిచూసిన రాజస్థాన్‌, ఎలిమినేటర్‌లో లఖ్‌నవూ ముందు 200 పైచిలుకు లక్ష్యాన్ని నిలిపినా అతి కష్టం మీద నెగ్గిన బెంగళూరు.. టీ20 లీగ్‌ రెండో ఫైనల్‌ బెర్తు కోసం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం అయిన మొతెరా మైదానంలో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. బలాబలాల్లో రెండు జట్లూ సమవుజ్జీలే అయినా.. గత కొన్ని మ్యాచ్‌ల ప్రదర్శన ప్రకారం బెంగళూరుదే పైచేయి. ఆ జట్టు చివరి 5 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచింది. ప్లేఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో, అలాగే ఎలిమినేటర్‌లో పట్టుదలతో ఆడి నెగ్గింది.

అతడి మీదే అందరి కళ్లూ..: బెంగళూరు జట్టులో పెద్ద స్టార్లున్నప్పటికీ రెండో క్వాలిఫయర్‌ ముంగిట అందరూ చర్చించుకుంటున్నది ఓ యువ ఆటగాడి గురించే. అతనే.. రజత్‌ పటిదార్‌. లీగ్‌ దశలో ఒకట్రెండు మంచి ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. ఇతడి మీద అభిమానుల దృష్టిపడలేదు. కానీ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మెరుపు శతకంతో అతడి పేరు మార్మోగిపోయింది. నాణ్యమైన లఖ్‌నవూ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ అతను సృష్టించిన విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. బెంగళూరు ఫైనల్‌ చేరిందంటే అతడి ఇన్నింగ్సే ప్రధాన కారణం. మరి శుక్రవారం అతనెలా ఆడతాడన్నది ఆసక్తికరం. చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఫామ్‌ అందుకున్నట్లే కనిపించి, మళ్లీ ఎలిమినేటర్‌లో తడబడ్డ కోహ్లి.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి. డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ కూడా కీలక సమరంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని, దినేశ్‌ కార్తీక్‌ ఫినిషర్‌ పాత్రను కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. హేజిల్‌వుడ్‌, హర్షల్‌ పటేల్‌, హసరంగ, సిరాజ్‌లతో బౌలింగ్‌ బలంగానే కనిపిస్తున్నా.. కీలక సమయంలో ప్రత్యర్థి జట్లకు ధారాళంగా పరుగులు సమర్పించుకునే బలహీనతను బెంగళూరు వీడకుంటే కష్టమే.

వాళ్లు చెలరేగితే..: రాజస్థాన్‌కు ముందు నుంచి బలం.. ఆ జట్టులోని విధ్వంసక బ్యాట్స్‌మెనే. జోస్‌ బట్లర్‌, సంజు శాంసన్‌ మెరుపులతో చాలా మ్యాచ్‌లు గెలిచిందా జట్టు. తొలి క్వాలిఫయర్‌లోనూ వీళ్లిద్దరూ సత్తా చాటారు. యశస్వి, పడిక్కల్‌ కూడా కొన్ని కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లీగ్‌ దశ ప్రథమార్ధంలో హెట్‌మయర్‌ మెరుపులు మెరిపించాడు. రెండో క్వాలిఫయర్లో వీరిలో కనీసం ముగ్గురు సత్తా చాటితేనే ఆ జట్టుకు విజయంపై ఆశలుంటాయి. చాహల్‌, బౌల్ట్‌, ప్రసిద్ధ్‌, అశ్విన్‌లతో కాగితం మీద రాజస్థాన్‌ బౌలింగ్‌ బలంగానే కనిపిస్తున్నా.. గత మ్యాచ్‌లో వీళ్లందరూ విఫలమయ్యారు. మరి బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న బెంగళూరును వీరు ఏమేర అడ్డుకుంటారో చూడాలి. బట్లర్‌, సంజుల మీద రాయల్స్‌ ఎక్కువ ఆధారపడుతుంది కాబట్టి బెంగళూరు బౌలర్లు వాళ్లిద్దరినీ లక్ష్యంగా చేసుకునే అవకాశముంది.

తుది జట్లు (అంచనా)... బెంగళూరు: డుప్లెసిస్‌ (కెప్టెన్‌), కోహ్లి, రజత్‌ పటిదార్‌, మ్యాక్స్‌వెల్‌, షాబాజ్‌ అహ్మద్‌, లొమ్రార్‌, దినేశ్‌ కార్తీక్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌, సిరాజ్‌, హేజిల్‌వుడ్‌.

రాజస్థాన్‌: బట్లర్‌, యశస్వి, శాంసన్‌ (కెప్టెన్‌), పడిక్కల్‌, హెట్‌మయర్‌, అశ్విన్‌, పరాగ్‌, బౌల్ట్‌, చాహల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మెకాయ్‌.

వేలంలో అమ్ముడవని వాడే..

కోల్‌కతా: రజత్‌ పటిదార్‌.. లఖ్‌నవూతో ఎలిమినేటర్‌లో మెరుపు సెంచరీతో బెంగళూరు రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించిన బ్యాట్స్‌మన్‌. దిగ్గజ ఆటగాళ్లతో ప్రశంసలు అందుకుంటున్న ఈ కుర్రాడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో కనీస ధర రూ.20 లక్షలకు కూడా అమ్ముడుపోలేదు. గత సీజన్లో బెంగళూరుకు ఆడిన అతను.. 4 మ్యాచ్‌ల్లో 71 పరుగులే చేశాడు. దీంతో ఈసారి వేలంలో బెంగళూరుతో పాటు ఏ జట్టూ అతణ్ని తీసుకోలేదు. కానీ మరో దేశవాళీ ఆటగాడు లవ్‌నీత్‌ సిసోడియా గాయపడటంతో అతడి స్థానంలో రజత్‌ను ఎంచుకుంది బెంగళూరు. ఈ అవకాశాన్ని గొప్పగా ఉపయోగించుకున్న రజత్‌.. లఖ్‌నవూపై మెరుపు ఇన్నింగ్స్‌తో హీరోగా మారాడు.

రజత్‌ అదరగొట్టాడు..: ఎలిమినేటర్‌లో రజత్‌ పటిదార్‌ శతకం.. తాను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటని విరాట్‌ కోహ్లి అన్నాడు. ‘‘ఒత్తిడిలో బ్యాట్స్‌మెన్‌ ఆడిన అనేక అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు చూశా. అందులో రజత్‌ ఇన్నింగ్స్‌ ఒకటి. అతడి బ్యాటింగ్‌ మామూలుగా లేదు.’’ అని కోహ్లి అన్నాడు.

* 2021 నుంచి మొతెరా మైదానంలో జరిగిన టీ20ల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు ఆరుసార్లు విజయం సాధించాయి. లక్ష్యాన్ని ఛేదించిన జట్లు 11 మ్యాచ్‌లు నెగ్గాయి.

*ఈ సీజన్లో బెంగళూరు, రాజస్థాన్‌ రెండు మ్యాచ్‌ల్లో తలపడగా.. చెరొకటి గెలిచాయి. మొత్తంగా టీ20 లీగ్‌ చరిత్రలో రెండు జట్లు 24 మ్యాచ్‌లు ఆడితే బెంగళూరు 13 నెగ్గింది. 11 మ్యాచ్‌లు రాజస్థాన్‌ సొంతమయ్యాయి.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని