IND vs NZ : అప్పుడే ఆరు పడగొట్టారు.. పట్టుబిగిస్తోన్న టీమ్‌ఇండియా

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పట్టుబిగిస్తోంది. తొలి..

Updated : 04 Dec 2021 15:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 325 పరుగులకు ఆలౌటైంది. అజాజ్‌ పటేల్‌ (10/119) చరిత్ర సృష్టించాడు. అయితే ఈ ఆనందం కివీస్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కివీస్‌ను పేస్‌ బౌలర్‌ సిరాజ్‌ (3/19) బెంబేలెత్తించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ ఆరు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. టామ్‌ లేథమ్‌ 10, విల్‌ యంగ్ 4, డారిల్‌ మిచెల్ 8, రాస్‌ టేలర్‌ 1, హెన్రీ నికోల్స్ 7, రచిన్‌ రవీంద్ర 4 పరుగులు చేశారు. సిరాజ్‌ కాకుండా అక్షర్‌ పటేల్, అశ్విన్‌, జయంత్‌ తలో వికెట్‌ తీశారు. దాదాపు ఐదేళ్ల తర్వాత జయంత్‌ యాదవ్‌ టెస్టుల్లో వికెట్‌ పడగొట్టడం విశేషం. కివీస్‌ ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులు వెనుకబడి ఉంది.

మూడో బౌలర్‌గా అజాజ్‌

కివీస్‌ బౌలర్ అజాజ్‌ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల ప్రదర్శన చేసిన మూడో బౌలర్‌గా అవతరించాడు. అంతకుముందు జేమ్‌లేకర్‌, అనిల్‌ కుంబ్లే ఈ ఘనత సాధించారు. మరోవైపు భారత బ్యాటర్లు మయాంక్‌ అగర్వాల్‌ (150), అక్షర్‌ పటేల్ (52), శుభ్‌మన్‌ గిల్‌ (44), వృద్ధిమాన్‌ సాహా (27) రాణించడంతో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగడం గమనార్హం. పుజారా, విరాట్ కోహ్లీ, అశ్విన్‌ పరుగులేమీ చేయకుండానే ఔటయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని