సోషల్‌ మీడియాకు పంత్ దూరం‌.. ఎందుకంటే?

బయటి ప్రపంచం నుంచి వచ్చే విమర్శల దాడి నుంచి తప్పించుకొనేందుకు సోషల్‌ మీడియాకు తనకు తాను దూరమయ్యానని టీమ్‌ఇండియా యువవికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ అన్నాడు. ఇప్పటికీ ప్రతిరోజూ సెగ తగులుతున్నట్టే అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని....

Published : 25 Jan 2021 23:11 IST

విమర్శల రణగొణ ధ్వని తప్పించుకొనేందుకే..

దిల్లీ: బయటి ప్రపంచం నుంచి వచ్చే విమర్శల దాడి నుంచి తప్పించుకొనేందుకు సోషల్‌ మీడియాకు తనకు తాను దూరమయ్యానని టీమ్‌ఇండియా యువవికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ అన్నాడు. ఇప్పటికీ ప్రతిరోజూ సెగ తగులుతున్నట్టే అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని వెల్లడించాడు.

ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌ తర్వాత రిషభ్ పంత్‌ పదేపదే విఫలమయ్యాడు. చెత్త షాట్లు ఆడటం, తేలిగ్గా వికెట్‌ పారేసుకోవడం, కీపింగ్‌లో ప్రాథమిక లోపాలతో జట్టులో చోటును ప్రశ్నార్థకం చేసుకున్నాడు. అయితే ఆస్ట్రేలియాతో సుదీర్ఘ ఫార్మాట్ ద్వారా అతడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఆఖరి రెండు టెస్టుల్లో వరుసగా 97, 89 పరుగులు చేశాడు. నొప్పి వేధిస్తున్నా నొప్పి నివారణ సూదులు తీసుకొని జట్టును ఆదుకున్న సంగతి తెలిసిందే.

‘ఇప్పటికీ ప్రతిరోజూ సెగ తగులుతున్నట్టే అనిపిస్తుంది. ఇవన్నీ ఆటలో భాగం. ఏదేమైనా మనపై మనకు విశ్వాసం ఉండాలి. నువ్వు ముందుకెళ్తున్నావంటే మెరుగవుతున్నట్టే లెక్క. కఠినదశలో నేను నేర్చుకొంది ఇదే. ఆటపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మిగతావి పట్టించుకోవద్దు. సోషల్‌మీడియా రణగొణ ధ్వనిని అడ్డుకోవడం కష్టమే. కానీ నేను స్వతహాగా దాన్నుంచి వేరయ్యా. బాగా ఆడుతున్నప్పుడు జనాలు బాగా రాస్తారు. ఆడకపోతే  విమర్శిస్తారు. ఇప్పటి క్రికెట్‌ జీవితంలో ఇది భాగమైపోయింది. అందుకే వాటిపై కాకుండా ఆటపై ధ్యాస పెడితే మంచిదని గ్రహించా’ అని పంత్‌ అన్నాడు.

‘సాధారణ క్రికెట్‌ ఆడాలన్న మనస్తత్వంతోనే ఉంటా. జట్టు యాజమాన్యం మొదటి ఇన్నింగ్స్‌ గురించి చెప్పినా సరే. పరుగులు చేసేందుకు, చెత్త బంతుల్ని శిక్షించేందుకు చూస్తుంటా. పరిధికి లోబడి చేయాల్సింది చేస్తాను. మ్యాచులో విజయం సాధించేందుకే చూడాలని జట్టు యాజమాన్యం మొదటి నుంచీ చెప్పింది. నేనూ విజయం గురించే ఆలోచిస్తా. డ్రా అన్నది రెండో ప్రాధాన్యం. కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. ప్రపంచకప్‌లో అంతగా రాణించలేదు. 30ల వద్దే ఔటయ్యాను. నాలుగేళ్లకు వచ్చే ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆడకపోవడం నిరాశపరిచింది. ఇప్పుడు మరింత మెరుగవ్వడంపైనే దృష్టిపెట్టా’ అని పంత్‌ తెలిపాడు.
ఇవీ చదవండి
కోహ్లీ అలా చేసేసరికి కన్నీళ్లు వచ్చాయి
శార్దూల్‌, సిరాజ్‌ రచించిన గబ్బా బౌలింగ్‌ వ్యూహం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని