రోహిత్‌ గాయం: బీసీసీఐపై వీరూ ఫైర్‌

రోహిత్‌శర్మ గాయం విషయంలో బీసీసీఐ వ్యవహార శైలి బాగాలేదని టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విమర్శించారు. హిట్‌మ్యాన్‌ పరిస్థితి ఏంటో కోచ్‌ రవిశాస్త్రికి తెలియదంటే తాను ఒప్పుకోనని పేర్కొన్నారు. గాయపడి విశ్రాంతి తీసుకున్న రోహిత్‌...

Published : 04 Nov 2020 15:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రోహిత్‌శర్మ గాయం విషయంలో బీసీసీఐ వ్యవహార శైలి బాగాలేదని టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విమర్శించారు. హిట్‌మ్యాన్‌ పరిస్థితి ఏంటో కోచ్‌ రవిశాస్త్రికి తెలియదంటే తాను ఒప్పుకోనని పేర్కొన్నారు. గాయపడి విశ్రాంతి తీసుకున్న రోహిత్‌ హైదరాబాద్‌ మ్యాచులో బరిలోకి దిగడంతో వీరూ బోర్డుపై ఘాటుగా విమర్శలు చేశారు.

‘రోహిత్‌ పరిస్థితి ఏంటో రవిశాస్త్రికి తెలియకుండా ఉండే అవకాశం లేదు. సెలక్షన్‌ కమిటీలో అతడు భాగం కానప్పటికీ ఎంపికకు రెండు మూడు రోజుల ముందైనా శాస్త్రి అభిప్రాయమేంటో సెలక్టర్లైనా మాట్లాడి ఉంటారు. ఆయన్నుంచి కొన్ని సూచనలు స్వీకరిస్తారు. నిజానికి రోహిత్‌ గాయపడి ఉంటే అతడి స్థానంలో మరెవరినైనా ప్రత్యామ్నాయంగా ప్రకటించాలి. అలా చేయలేదు. అతడికీ జట్టులో చోటివ్వలేదు. ఇదే నాకు అర్థంకావడం లేదు. ఈ ఏడాది వింతగా ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారు? రోహిత్‌ హైదరాబాద్‌పై ఆడాడు. మున్ముందు ప్లేఆఫ్స్‌ కూడా ఆడతాడు. దృఢంగా ఉన్నానని అతడు అంటున్నాడు. అలాంటప్పుడు ఎందుకు ఎంపిక చేయడం లేదు’ అని వీరూ ప్రశ్నించాడు.

‘ఫ్రాంచైజీకి ఆడేందుకు సిద్ధంగా ఉన్న ఆటగాడిని జాతీయ జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదన్నదే నన్ను ఆశ్చర్యపరుస్తోంది. నిజంగా బీసీసీఐ వ్యవహార శైలి విస్మయం కలిగిస్తోంది. అతడు ఐపీఎల్‌ ఆడుతుంటే జాతీయ జట్టులోకీ తీసుకోవచ్చు కదా’ అని సెహ్వాగ్‌ అన్నాడు. అయితే లీగులో మున్ముందు మ్యాచులు ఆడటంపై హిట్‌మ్యాన్‌ పరిణతితో నిర్ణయం తీసుకోవాలని బోర్డు అధ్యక్షుడు గంగూలీ మంగళవారం సూచించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని