Cricket News: సచిన్‌ను ఎలా కాపీ కొట్టేవాడినంటే:వీరూ

టీవీలో సచిన్‌ తెందూల్కర్‌ను చూసి అనుకరించేవాడినని టీమ్‌ఇండియా డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పాడు. సచిన్‌లాగే స్ట్రెయిట్‌ డ్రైవ్‌లు, బ్యాక్‌ఫుట్‌ పంచ్‌లు ఆడేవాడినని అన్నాడు. ఇప్పట్లా క్రికెట్‌ వీడియోలు, యాప్‌లు అందుబాటులో ఉంటే మరింత ముందుగా భారత్‌కు ఆడేవాడినని పేర్కొన్నాడు....

Published : 10 Jun 2021 01:36 IST

ముంబయి: టీవీలో సచిన్‌ తెందూల్కర్‌ను చూసి అనుకరించేవాడినని టీమ్‌ఇండియా డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వెల్లడించాడు. సచిన్‌లాగే స్ట్రెయిట్‌ డ్రైవ్‌లు, బ్యాక్‌ఫుట్‌ పంచ్‌లు ఆడేవాడినని అన్నాడు. ఇప్పట్లా క్రికెట్‌ వీడియోలు, యాప్‌లు అందుబాటులో ఉంటే మరింత ముందుగా భారత్‌కు ఆడేవాడినని పేర్కొన్నాడు. మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌తో కలిసి Cricuru యాప్‌ను అతడు ఆవిష్కరించాడు. దానికి వీరిద్దరే స్థాపకులు కావడం గమనార్హం.

‘క్రికెట్‌ను మైదానంలో ఆడతారు. కానీ బయట నుంచి చాలా నేర్చుకోవచ్చు. నా సొంత ఉదాహరణే ఇస్తాను. 1992 ప్రపంచకప్‌ నుంచి నేను క్రికెట్‌ చూడటం ఆరంభించాను. ఆ సమయంలోనే నేను సచిన్‌ తెందూల్కర్‌ను చూసి అనుకరించేవాడిని. స్ట్రెయిట్‌ డ్రైవ్‌లు ఎలా ఆడుతున్నాడో, బ్యాక్‌ఫుట్‌ పంచ్‌లు ఎలా ఆడుతున్నాడో గమనించి కాపీ కొట్టేవాడిని. 1992లో నేనలా నేర్చుకోగలిగితే ఇప్పుడెందుకు సాధ్యమవ్వదు’ అని సెహ్వాగ్‌ అన్నాడు.

గొప్ప క్రికెటర్లు పంచుకొనే వీడియోలు చూస్తూ క్రికెట్‌ నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యాన్ని వీరూ వివరించాడు. ‘ఇప్పుడు మీరు అభిమానించే ఏబీ డివిలియర్స్‌, బ్రయన్‌ లారా, క్రిస్‌గేల్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ సహా మరెంతోమంది క్రికెటర్ల వీడియోలు అందుబాటులో ఉన్నాయి. మా కాలంలో అలాంటి అవకాశమే లేదు. నేనాడేటప్పుడు ఆన్‌లైన్‌లో మరొకరితో మాట్లాడటం, సులభంగా వీడియోలను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడం వంటి సౌకర్యాలు ఉండుంటే ఇంకా మెరుగ్గా నేర్చుకొనేవాడిని. టీమ్‌ఇండియాకు త్వరగా ఎంపికయ్యేవాడిని’ అని తెలిపాడు.

క్రికెటర్లకు మానసిక దారుఢ్యం, నైపుణ్యాలు అవసరమని సెహ్వాగ్‌ అన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్లు తమ పొరపాట్లను సరిచేసుకొనేందుకు ఎంత ఇబ్బంది పడతారో బంగర్‌ తనకు వివరించాడన్నాడు ‘ఆటలో మానసిక అంశం అవసరం ఎంతైనా ఉంది. అందుకే మేం మొదట దీనిపైనే దృష్టి సారించాం. ఆ తర్వాత క్రికెట్‌ నైపుణ్యాలు నేర్పిస్తాం. నేను సంజయ్‌తో మాట్లాడినప్పుడు మానసిక అంశాలు, నైపుణ్యాలు రెండూ అవసరమేనని చెప్పాడు. ఎందుకంటే బ్యాటింగ్‌ కోచ్‌గా అతడు భారత క్రికెట్‌ జట్టుతో చాలాకాలం గడిపాడు. చాలామంది అంతర్జాతీయ క్రికెటర్లు తమ పొరపాట్లను గుర్తించి సరిచేసుకొనేందుకు ఎంత ఇబ్బంది పడతారో నాతో పంచుకున్నాడు’ అని వీరూ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని