Prithvi Shaw: పృథ్వీషాకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: గౌతమ్‌ గంభీర్

టీమ్‌ఇండియాలో యువ క్రికెటర్లకు కొదవేం లేదు. అయితే జట్టులో స్థానం కోసం మాత్రం వేచి చూస్తూనే ఉన్నారు. అలాంటి జాబితాలో పృథ్వీ షా ఒకడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం ముందుంటాడు.

Published : 31 Dec 2022 19:03 IST

ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ క్రికెట్‌లో యువ క్రికెటర్‌ పృథ్వీ షా అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ అతడికి భారత జట్టులో స్థానం మాత్రం దక్కడం లేదు. ఈ క్రమంలో యువ బ్యాటర్ పృథ్వీషాకు మరిన్ని అవకాశాలు ఇచ్చి సరైన మార్గంలో నడిపించడానికి సెలక్టర్లు, కోచ్‌లు ప్రయత్నించాలని భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నారు. 

‘‘కోచ్‌లు, సెలెక్టర్లు ఎందుకు ఉన్నారు. జట్టును ఎంపిక చేయడం, ఆటకు వారిని సిద్ధం చేయడం మాత్రమే వారి పని కాదు. కుర్రాళ్లు, ముఖ్యంగా పృథ్వీ షా వంటి ఆటగాళ్లను సరైన దారిలో నడిపించాలి. అందుకు కోచ్‌లు, సెలెక్టర్లు, యాజమాన్యం ప్రయత్నించాలి. అది యాజమాన్యం బాధ్యత. జట్టును సిద్ధం చేయడం, ప్రాక్టీస్‌ సెషన్స్‌లో వారికి సహాయ పడటం మాత్రమే కాదు. ఒకవేళ అదే నిజమైతే రాహుల్‌ ద్రావిడ్‌ లేదా సెలక్షన్‌ ఛైర్మన్‌ అతడితో మాట్లాడాలి. అతడికి ఒక స్పష్టత కల్పించి ఎల్లప్పుడూ జట్టు చుట్టూనే ఉంచాలి. ఎవరైతే సరైన దారిలో లేరో వారిని జట్టుతోపాటు ఉండేలా చూడాలి. ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షిస్తూ ఉండాలి. తర్వాత వారిని వదిలిపెట్టిన క్షణం వారు అన్నిచోట్లకూ వెళ్లగలరు. ఎక్కడైనా రాణించగలరు. దేశం కోసం ఆడాలనే అభిరుచి, అంకిత భావం ఉండే ఆటగాళ్లు కచ్చితంగా ఫిట్‌నెస్‌, క్రమశిక్షణ వంటి అంశాలను పాటించాలి. అలా పాటించమని పృథ్వీషాను ఒత్తిడి చేసే శిక్షకులు ఉన్నారు. అతడికి ఒక అవకాశం.. వీలైతే మరిన్ని అవకాశాలు కల్పించాలి. అయినా మారకపోతే అతడికి దేశం తరఫున ఆడాలనే అభిరుచి లేదనుకోవాలి’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని