T20 World Cup: టీమ్‌ఇండియాకు షాకేనా..? టీ20 ప్రపంచకప్‌ జట్టులో షమి లేనట్టేనా..?

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్పే లక్ష్యంగా టీమ్‌ఇండియా ఇప్పటికే సన్నద్ధం మొదలెట్టింది. అందుకోసం ప్రతి ఆటగాడి ప్రదర్శనపై సెలెక్టర్లు దృష్టిసారించారు...

Published : 01 Jul 2022 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్పే లక్ష్యంగా టీమ్‌ఇండియా సన్నద్ధమవుతోంది. అందుకోసం ప్రతి ఆటగాడి ప్రదర్శనపై సెలెక్టర్లు దృష్టిసారించారు. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్‌లో ఎక్కువ మంది ఆటగాళ్లకు అవకాశం ఇస్తున్నారు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌ సిరీస్‌లకు యువ ఆటగాళ్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే, కొంతమంది సీనియర్లను రాబోయే ప్రపంచకప్‌ టోర్నీకి పక్కనబెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌ జట్టు ప్రణాళికల్లో సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి ఉండడని తెలుస్తోంది.

అతడు ఈ ఫార్మాట్‌కు సరిపోడని.. సెలెక్టర్లు భావిస్తున్నారని తెలుస్తోంది. అతడి స్థానంలో యువ బౌలర్లకు అవకాశమివ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌ (అక్టోబర్‌- నవంబర్‌)కు ముందు భారత్‌ ఆడే పొట్టి సిరీస్‌లకు షమిని ఎంపికచేయకపోవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మరోవైపు సీనియర్‌ పేసర్లు భువనేశ్వర్‌, బుమ్రా ప్రపంచకప్ జట్టులో ఉంటారని స్పష్టమవుతోంది. అయితే, ఇటీవల రాణించిన అవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌లను రాబోయే సిరీస్‌లకు కూడా ఆడించే వీలుంది. జులై 7 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే పొట్టి ఫార్మాట్‌కు కూడా వీరినే పరిగణనలోకి తీసుకోనున్నారని సమాచారం. దీంతో షమి ఈసారి టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా వెళ్లే విమానం ఎక్కకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

షమి చివరిసారిగా టీమ్‌ఇండియా తరఫున గతేడాది టీ20 ప్రపంచకప్‌లో నమీబియాపై ఆడాడు. ఆ తర్వాత నేరుగా భారత టీ20 లీగ్‌లోనే పోటీపడ్డాడు. కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన అతడు 8.00 ఎకానమీతో 20 వికెట్లు పడగొట్టాడు. పవర్‌ప్లే, డెత్‌ ఓవర్లలలో కీలక వికెట్లు తీసి గుజరాత్‌ ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు