Updated : 08 Dec 2021 07:20 IST

IND vs SA: పెద్దన్నలకు పరీక్ష

ఈనాడు క్రీడావిభాగం

విరాట్‌ కోహ్లి, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె.. దిగ్గజాల నిష్క్రమణ తర్వాత టెస్టుల్లో భారత జట్టుకు బ్యాటింగ్‌ మూల స్తంభాలుగా మారిన ముగ్గురు ఆటగాళ్లు. ఒకప్పటితో పోలిస్తే కోహ్లి జోరు తగ్గిన మాట వాస్తవం. అతను సెంచరీ చేసి రెండేళ్లయింది. అలాగని విరాట్‌ పూర్తిగా బ్యాటింగ్‌ లయ కోల్పోలేదు. కోహ్లి స్థాయి ఆటగాడిని తక్కువ అంచనా వేయలేం. పైగా అతను మూడు ఫార్మాట్లలో విరామం లేకుండా ఆడుతున్న క్రికెటర్‌. త్వరలోనే కోహ్లి పూర్వపు ఫామ్‌ను అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ టెస్టుల్లో మాత్రమే ఆడే రహానె, పుజారా ఈ ఫార్మాట్లోనూ తమ స్థానాలను నిలబెట్టుకోవడం కష్టంగా మారిందిప్పుడు. జట్టుకు వరంలా ఉన్న ఆటగాళ్లు కొంత కాలంగా భారం అయిపోతున్నారు. మయాంక్‌, శ్రేయస్‌ లాంటి యువ ఆటగాళ్లు అదరగొడుతుంటే వీళ్లు తేలిపోతున్నారు. కుర్రాళ్లు మరిందరు టీమ్‌ఇండియా వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకుంటే జట్టులో చోటు గల్లంతవక తప్పదు.

రాహుల్‌ ద్రవిడ్‌ ఖాళీ చేసిన మూడో స్థానంలో నిలకడగా ఆడుతూ టీమ్‌ఇండియా కొత్త ‘గోడ’ అనిపించుకున్న ఆటగాడు చెతేశ్వర్‌ పుజారా. మరీ ద్రవిడ్‌ స్థాయిలో కాకపోయినా.. చెప్పుకోదగ్గ స్థాయిలోనే విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు చెతేశ్వర్‌. ద్రవిడ్‌ లాగే గంటలు గంటలు క్రీజులో పాతుకుపోవడం, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటంతో మంచి గుర్తింపు సంపాదించిన ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్‌ కొన్నేళ్ల నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. అతను సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు కావస్తుండటం గమనార్హం. చివరగా 2019 జనవరిలో ఆస్ట్రేలియాలో 193 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు చెతేశ్వర్‌. నాలుగు టెస్టుల ఆ సిరీస్‌లో మరో శతకం సహా 500 పైచిలుకు పరుగులు చేసిన పుజారా.. ఆ తర్వాత ఈ స్థాయి ప్రదర్శన ఏ సిరీస్‌లోనూ చేయలేదు. అప్పుడప్పుడూ అర్ధశతకాలు సాధిస్తున్నా.. మూడంకెల స్కోరు మాత్రం అందుకోవడం లేదు. గతంలో ఎన్నోసార్లు జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఆపద్బాంధవుడి పాత్ర పోషించిన పుజారా.. ఈ మధ్య ఆ నమ్మకాన్ని నిలబెట్టలేకపోతున్నాడు.

ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారే పుజారా.. ఇటీవల సులువుగా వికెట్లు ఇచ్చేస్తున్నాడు. ఇటీవలి న్యూజిలాండ్‌ సిరీస్‌లో స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ను ఎదుర్కోవడానికి అతను చాలా ఇబ్బంది పడ్డాడు. తొలి టెస్టులో అజాజ్‌ బంతికి క్రీజులో ఉక్కిరి బిక్కిరి అయి బౌల్డ్‌ అయిన తీరు.. పుజారా టెక్నిక్‌ను ప్రశ్నార్థకం చేసేదే. కొన్నిసార్లు గంటలు గంటలు క్రీజులో నిలుస్తున్నాడు కానీ.. పరుగులు మాత్రం చేయలేకపోతున్నాడు. ఉన్నంతసేపు ఉండి, పెద్దగా పరుగులు చేయకుండానే నిష్క్రమిస్తున్నాడు. దీంతో అంతసేపు క్రీజులో నిలిచినందుకు ప్రయోజనం లేకుండా పోతోంది. మ్యాచ్‌ పరిస్థితులతో సంబంధం లేకుండా పుజారా మరీ ఆత్మరక్షణకు పోతుండటం, పరుగులు చేయకపోవడంతో అవతలి బ్యాట్స్‌మెన్‌ మీద ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఏడాది పుజారా 13 టెస్టుల్లో 29.82 సగటుతో 686 పరుగులే చేశాడు. 2016 సమయానికి పుజారా కెరీర్‌ సగటు 51 కాగా.. ఇప్పుడది 45 లోపు పడిపోవడం అతడి ఫామ్‌కు సూచిక. పుజారాతో పోలిస్తే రహానె ఫామ్‌ మరీ దారుణంగా ఉండటంతో ముందు అతడిపై వేటు పడింది. ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే.. పుజారాపై వేటు పడే రోజు కూడా ఎంతో దూరంలో లేకపోవచ్చు.

ఒక టెస్టు మ్యాచ్‌లో జట్టుకు నాయకత్వం వహించిన ఆటగాడికి తర్వాతి మ్యాచ్‌కు తుది జట్టులో చోటే దక్కకపోవడం అరుదైన విషయం. అజింక్య రహానె విషయంలో అదే జరిగింది. విరాట్‌ కోహ్లి అందుబాటులో లేకపోవడంతో తొలి టెస్టుకు అతనే నాయకత్వం వహించాడు. కెప్టెన్‌గా ప్రతిభ చాటుకున్నా.. బ్యాటింగ్‌లో పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులే చేసిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా, ఎంతో బాధ్యతాయుతంగా ఆడాల్సిన స్థితిలో 4 పరుగులకే వికెట్‌ ఇచ్చేశాడు. రెండో టెస్టుకు కోహ్లి జట్టులోకి రావడం, తొలి టెస్టులో అవకాశం దక్కించుకున్న శ్రేయస్‌ అద్భుత శతకం సాధించడంతో.. రహానెపై వేటు తప్పలేదు. గాయం పేరు చెప్పి గౌరవంగా పక్కన పెట్టినా, అది వేటే అన్నది స్పష్టం. నిజానికి ఈ ఏడాది రహానె ఫామ్‌ను గమనిస్తే అతను ఇప్పటిదాకా తుది జట్టులో ఉండటమే గొప్ప.

22, 4, 37, 24, 1, 0, 67, 10, 7, 27, 49, 15, 5, 1, 61, 18, 10, 14, 0, 35, 4.. ఈ ఏడాది రహానె బ్యాటింగ్‌ చేసిన 21 ఇన్నింగ్స్‌ల్లో స్కోర్లివి. కేవలం రెండుసార్లు మాత్రమే అతను 50 స్కోరును దాటాడు. ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇంగ్లాండ్‌తో సొంతగడ్డపై, ఆ తర్వాత వారి దేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో నిలకడగా విఫలమయ్యాడు రహానె. కీలకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో.. ఇప్పుడు స్వదేశంలో న్యూజిలాండ్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయాడు. ఈ ఏడాది భారత ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన రహానెదే. 12 టెస్టుల్లో కేవలం 19.47 సగటుతో 411 పరుగులే చేశాడు. ఈ వైఫల్యాల పరంపర చూస్తే రహానెపై ఎప్పుడో వేటు పడాల్సింది అనిపిస్తుంది. అయితే గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో ఘోర పరాభవం అనంతరం కోహ్లి వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చేస్తే.. సారథ్య బాధ్యతలు అందుకుని దాదాపు ద్వితీయ శ్రేణి అనదగ్గ జట్టును అతను గొప్పగా నడిపించి చరిత్రాత్మక సిరీస్‌ విజయాన్నందించాడు. రెండో టెస్టులో అతడి వీరోచిత శతకమే (112) సిరీస్‌ను మలుపు తిప్పింది. ఈ సిరీస్‌ ఘనతే రహానె ఇప్పటిదాకా జట్టులో కొనసాగడానికి కారణమైంది. కానీ ఎంతకూ అతను ఫామ్‌ అందుకోకపోవడంతో ఇప్పుడు వేటు తప్పలేదు.


* పుజారా, రహానెలిద్దరికీ రాబోయే దక్షిణాఫ్రికా పర్యటన అత్యంత కీలకం. వారి అనుభవం, గత ప్రదర్శన దృష్ట్యా ఈ పర్యటనకు ఇద్దరూ జట్టులో ఉంటారు. అయితే కఠినమైన దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో వీళ్లు సత్తా చాటడం జట్టుకే కాక వారికీ చాలా అవసరం. ఈ పర్యటనలో కనుక విఫలమైతే మాత్రం ఇద్దరినీ సాగనంపడం ఖాయం!


 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని