అలా అడిగే సరికి.. సెరెనా భావోద్వేగం.. 

ఆస్ట్రేలియా ఓపెన్‌ 2021 టోర్నీ నుంచి అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరీనా విలియమ్స్‌ నిష్క్రమించింది. ఈ టోర్నీలో గెలుపొంది 24 సార్లు అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లు సాధించాలన్న...

Updated : 18 Feb 2021 15:35 IST

ప్రెస్‌మీట్‌ను మధ్యలోనే ముగించిన అమెరికన్ స్టార్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ 2021 టోర్నీ నుంచి అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ నిష్క్రమించింది. ఈ టోర్నీలో గెలుపొంది సింగిల్స్‌లో అత్యధికంగా 24 సార్లు గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లు సాధించాలన్న ఆమె కోరిక ఇప్పటికి కలగానే మిగిలిపోయింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో గురువారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో సెరెనా ఓటమిపాలైంది. మూడో సీడ్‌‌ నవోమి ఒసాకా చేతిలో 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో ఓటమి చవిచూసింది. దీంతో మ్యాచ్‌ అనంతరం సెరెనా అభిమానులకు అభివాదం చేస్తూ కోర్టును వీడింది.

అయితే, మ్యాచ్‌ అనంతరం జరిగిన మీడియా సమావేశాన్ని సెరెనా మధ్యలోనే ముగించింది. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆమె భావోద్వేగానికి గురై అక్కడి నుంచి వెళ్లిపోయింది. ‘ఇదే మీ చివరి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ కాబోతోందా?’ అని అడిగిన ప్రశ్నకు ఆమె కంటతడి పెట్టింది. తర్వాత మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించింది. అయితే, సెరెనా వెళ్లే ముందు ఇలా పేర్కొనడం గమనార్హం.. ‘ఆటకు వీడ్కోలు పలికితే, ఎవరికీ చెప్పకుండా చేస్తానేమో. నాకు తెలియదు’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాక అభిమానులకు ఆమె అభివాదం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదే సెరెనాకు తుదిపోరు కావొచ్చని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

కాగా, సెరెనా ఇదివరకు ఒసాకా చేతిలో 2018 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లోనూ ఓటమిపాలైంది. ఆపై మూడో సీడ్‌ ఒసాకా 2019 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, 2020 యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఇక ఈసారి శనివారం జరిగే ఫైనల్లో ఒసాకా ఎవరిని ఓడిస్తుందో చూడాలి. మరో సెమీస్‌లో తలపడే జెన్నీఫర్‌ బ్రాడీ, కరోలినా ముచావో.. ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారితో ఒసాకా తుదిపోరులో పోటీపడనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని