Serena Williams: నేను అబ్బాయిని అయితే.. ఆటను వదిలిపెట్టేదాన్నే కాదు..!

గెలుపే లక్ష్యంగా టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టిన అమెరికా టెన్నిస్ తార సెరెనా విలియమ్స్‌.. 23 గ్రాండ్‌ స్లామ్‌లను తన ఖాతాలో వేసుకుంది.

Published : 11 Aug 2022 01:38 IST

న్యూయార్క్‌: గెలుపే లక్ష్యంగా టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టిన అమెరికా టెన్నిస్ తార సెరెనా విలియమ్స్‌.. 23 గ్రాండ్‌ స్లామ్‌లను తన ఖాతాలో వేసుకుంది. అలా గెలుస్తూనే.. స్టెఫీగ్రాప్‌, క్రిస్‌ ఎవర్ట్‌, మార్టినా నవ్రతిలోవా వంటి దిగ్గజాలను అధిగమించింది. 2017లో రెండు నెలల గర్భిణిగా ఆస్ట్రేలియా ఓపెన్‌ను దక్కించుకుంది. అది ఆమెకు 23వ టైటిల్‌. క్లిష్టతరమైన కాన్పు తర్వాత నుంచి మునుపటిలా సత్తా చాటి.. మార్గరెట్‌ కోర్టు (24 టైటిళ్లు)ను దాటేందుకు ప్రయత్నించి అడుగుదూరంలోనే మిగిలిపోయింది. ఈ సమయంలో ఆమె కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిరావడంతో.. ఈ 41 ఏళ్ల దిగ్గజం ఆటకు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమైంది. మంగళవారం వోగ్‌ మ్యాగజైన్‌లో ప్రచురితమైన కవర్‌ స్టోరీలో ద్వారా ఈ విషయం వెల్లడైంది.

‘వృత్తిగత జీవితం, పిల్లలు.. ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలని నేనేప్పుడు అనుకోలేదు. అది న్యాయం కాదు. కానీ నాకిప్పుడు 41 సంవత్సరాలు. నేను ఏదోఒకటి ఇవ్వాలి. నేనుగనుక ఒక అబ్బాయి అయితే.. ఇప్పుడే రిటైర్మెంట్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం వచ్చేది కాదు. నా భార్య పిల్లల్ని కనేందుకు శారీరక శ్రమకు గురవుతుంటే.. నేను ఆటపై దృష్టి పెట్టి విజయాలు సొంతం చేసుకునేదాన్ని. టామ్‌ బ్రాడీ కంటే ఎక్కువ ఆడేదాన్ని. రిటైర్మెంట్‌ అన్న పదమే నాకు నచ్చదు. అది ఆధునిక పదంలా ఉండదు. వీడ్కోలు గురించి చాలా రోజులుగా ఆలోచిస్తున్నా. జీవితంలో భిన్న దిశలో ప్రయాణించడానికి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది. ఆ సమయంలో చాలా కష్టంగా ఉంటుంది. నా కౌంట్‌డౌన్‌ మొదలైంది’ అంటూ తన వీడ్కోలు గురించి ఆవేదనగా స్పందించింది.   

ప్రస్తుతం తన రిటైర్మెంట్‌ గురించి ఆమె కచ్చితమైన సమయమేమీ చెప్పలేదు. యూఎస్‌ ఓపెన్‌లో పాల్గొంటున్నట్లు మాత్రం వెల్లడించింది. ‘దురదృష్టవశాత్తూ ఈ ఏడాది వింబుల్డన్‌ గెలవలేకపోయాను. అలాగే న్యూయార్క్‌లో గెలిచేందుకు సిద్ధంగా ఉన్నానో లేదో నాకు తెలీదు. కానీ నేను నా వంతు ప్రయత్నం చేయాలనుకుంటున్నాను’ అని అన్నారు. ఈ నెల చివర్లో న్యూయార్క్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఇటీవల జరిగిన వింబుల్డన్‌ టోర్నీలో ఆమెకు తొలిరౌండ్‌లోనే చుక్కెదురైంది. అన్‌ సీడెడ్ ప్లేయర్ చేతిలో ఓటమి చవిచూసింది. 

ఆధునిక టెన్నిస్‌ యుగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు కైవసం చేసుకున్న క్రీడాకారిణి సెరెనా విలియమ్సే. ఇప్పటి వరకు 23 గెలుచుకుంది. అయితే ఆల్‌టైం అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డు మార్గరెట్‌ కోర్ట్‌ పేరుతో ఉంది. ఆమె 24 గెలిచింది. ఎలాగైనా సరే ఆమె రికార్డును సమం చేయాలని మూడేళ్లకు పైగా సెరెనా శ్రమిస్తోంది. కానీ పరిస్థితులు అచ్చిరాకపోవడం, గాయాల బెడదతో కుదరడం లేదు. ఈ క్రమంలో ఈ యూఎస్‌ ఓపెన్ ఆమెకు చివరిదికావొచ్చని తెలుస్తోంది. 

ఆమె కుటుంబం విషయానికొస్తే.. సెరెనా భర్త పేరు అలెక్సిస్ ఒహానియన్‌. ఆయన రెడిట్ సహ వ్యవస్థాకుడు. 2017లో వారికి ఒక పాప ఒలింపియా జన్మించింది. ఆ కాన్పు క్లిష్టం కావడంతో చావు అంచులవరకు వెళ్లినట్లు గతంలో వెల్లడించింది. కానీ మరిన్ని టైటిళ్లు గెలిచే ఆశ మాత్రం ఆమె నుంచి దూరం కాలేదు. కానీ మునుపటి ఫిట్‌నెస్ స్థాయిని ఆమె అందుకోలేకపోయింది. ఇదిలా ఉండగా.. టెన్నిస్ తర్వాత సెరెనా తన వెంచర్ క్యాపిటల్‌ ఫర్మ్‌పై దృష్టిపెట్టాలని యోచిస్తోంది. దీనికి కింద మహిళలు, ఇతర వర్ణాల వారి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టనుంది. ఆర్థికంగా టెన్నిస్ తార పరిస్థితి వేరే అయినప్పటికీ.. అమెరికాలో చాలా మంది ఉద్యోగినులు(54 శాతం మంది) తమ కుటుంబం కోసం పనిగంటలు తగ్గించుకోవాల్సి వస్తోందని ప్యూ రిసెర్చ్‌ అధ్యయనంలో వెల్లడైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని