Wimbledon: చెదిరిన కల.. ఏడుస్తూ సెరెనా నిష్క్రమణ

అమెరికా టెన్నిస్‌ తార సెరెనా విలియమ్స్‌ తీవ్ర భావోద్వేగం చెందింది. అభిమానుల సమక్షంలో కన్నీరు పెట్టుకుంది. తన చిరకాల స్వప్నం మరింత ఆలస్యం కావడమే ఇందుకు కారణం. గాయం కారణంగా ఆమె వింబుల్డన్‌ నుంచి తొలి రౌండ్లోనే తప్పుకొంది.....

Updated : 30 Jun 2021 10:43 IST

వింబుల్డన్‌: అమెరికా టెన్నిస్‌ తార సెరెనా విలియమ్స్‌ తీవ్ర భావోద్వేగానికి గురైంది. అభిమానుల సమక్షంలో కన్నీరు పెట్టుకుంది. తన చిరకాల స్వప్నం మరింత ఆలస్యం కావడమే ఇందుకు కారణం. గాయం కారణంగా ఆమె వింబుల్డన్‌ నుంచి తొలి రౌండ్లోనే తప్పుకొంది.

ఆధునిక టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు కైవసం చేసుకున్న క్రీడాకారిణి సెరెనా విలియమ్సే. ఇప్పటి వరకు 23 గెలుచుకుంది. అయితే ఆల్‌టైం అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డు మార్గరెట్‌ కోర్ట్‌ పేరుతో ఉంది. ఆమె 24 గెలిచింది. ఎలాగైనా సరే ఆమె రికార్డును సమం చేయాలని రెండేళ్లకు పైగా సెరెనా శ్రమిస్తోంది. కానీ పరిస్థితులు అచ్చిరాకపోవడం, గాయాల బెడదతో కుదరడం లేదు.

తనకు అచ్చొచ్చిన వింబుల్డన్‌పై సెరెనా విలియమ్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకొంది. అనూహ్యంగా గాయం కారణంగా నిష్ర్కమించక తప్పలేదు. మంగళవారం ఆమె సెంటర్‌ కోర్టులో అలియక్‌సాండ్ర ససనోవిచ్‌తో తలపడింది. ఐదో గేమ్‌లో సర్వీస్‌ చేస్తుండగా బేస్‌లైన్‌ వద్ద ఆమె కాలు బెణికింది. పాయింట్ల మధ్య నొప్పితో విలవిల్లాడింది. ఆ గేమ్‌ ముగియగానే మెడికల్‌ టైమ్‌ ఔట్‌ తీసుకొని ఆటను కొనసాగించింది.

నొప్పికి తట్టుకోలేక విలియమ్స్‌ పెదవులను బిగపట్టి కన్నీరు పెట్టుకుంది. ముఖానికి చేతులు అడ్డు పెట్టుకొని విలవిల్లాడింది. ఆ సమయంలో అభిమానులు ఆమెకెంతో అండగా నిలిచారు. అరుపులతో ప్రోత్సహించారు. చివరికి నొప్పి భరించలేని ఆమె మోకాళ్లపై మైదానంలో కూలబడింది. ఛైర్‌ అంపైర్‌ ఆమె దగ్గరికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఆ తర్వాత నెట్‌ వద్దకు వెళ్లిన విలియమ్స్‌ ప్రత్యర్థితో చేయి కలిపి అభిమానులకు వందనం చేస్తూ ఏడుస్తూ మ్యాచ్‌ నుంచి తప్పుకుంది.

సెరెనా విలియమ్స్‌ కెరీర్‌లో ఒక గ్రాండ్‌స్లామ్‌ తొలి రౌండ్లోనే తప్పుకోవడం ఇది కేవలం రెండోసారే. ఆమె ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌లో ఏడుసార్లు ఛాంపియన్‌ కావడం గమనార్హం. 2016లోనూ గెలిచింది. పోటీ చేసిన చివరి రెండు సార్లు అంటే 2018, 2019లో ఆమె వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచింది. కరోనా వైరస్‌ కారణంగా గతేడాది టోర్నీ నిర్వహించలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని