Shahbaz Ahmed: వాషింగ్టన్‌ సుందర్‌కు గాయం.. షాబాజ్‌కు పిలుపు

టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. గతవారం ఇంగ్లాండ్‌లో రాయల్‌ లండన్‌ వన్డే కప్‌ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో సుందర్‌ ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది

Published : 16 Aug 2022 14:47 IST

(Photo: Shahbaz Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా ఆఫ్‌-స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. గతవారం ఇంగ్లాండ్‌లో రాయల్‌ లండన్‌ వన్డే కప్‌ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో సుందర్‌ ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతడు జింబాబ్వే పర్యటనకు వెళ్లట్లేదని బీసీసీఐ వెల్లడించింది. దీంతో సుందర్‌ స్థానంలో షాబాజ్‌ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ నేడు అధికారికంగా ప్రకటించింది.

27 ఏళ్ల బెంగాల్‌ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ జింబాబ్వే సిరీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. బెంగాల్‌ తరఫున దేశవాళీ క్రికెట్‌లో షాబాజ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 18 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడి 41.64 సగటుతో 1041 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. 2.64 ఎకానమీతో 57 వికెట్లు తీశాడు. 2019-20 రంజీ టోర్నమెంట్‌లో 500 పరుగులు చేయడమే గాక, 35 వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా మెప్పించాడు. టీ20 మెగా టోర్నీలో 2020 నుంచి బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఆగస్టు 18 నుంచి టీమిండియా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. సీనియర్‌ ఆటగాళ్లైన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, భువనేశ్వర్‌, మహమ్మద్‌ షమీ, బుమ్రాలతో పాటు రిషభ్ పంత్‌కు విశ్రాంతినిచ్చారు. తొలుత శిఖర్‌ ధావన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ ప్రకటించినా.. కేఎల్‌ రాహుల్‌ అందుబాటులోకి రావడంతో అతడు జట్టు పగ్గాలు అందుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని