Shaheen Afridi: గ్యారీ కిరిస్టెన్‌తో దురుసు ప్రవర్తన.. చిక్కుల్లో షహీన్‌ అఫ్రిది!

పాకిస్థాన్ పేసర్ షహీన్ చిక్కుల్లో పడ్డాడు. కొత్తగా వచ్చిన కోచ్‌ కిరిస్టెన్‌తో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటిపై విచారణ చేపట్టాలనే డిమాండ్లు రావడం గమనార్హం.

Updated : 11 Jul 2024 14:23 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) పాకిస్థాన్‌ గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు రేగాయి. ఏకంగా కోచ్‌ గ్యారీ కిరిస్టెన్‌ పాక్‌ ఆటగాళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో సెలక్షన్ కమిటీపై పీసీబీ చర్యలు చేపట్టింది. తాజాగా పాక్‌ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది గురించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కోచ్‌ కిరిస్టెన్‌తో అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. కోచ్‌తోపాటు ఇతర సహాయక సిబ్బందితోనూ షహీన్‌ ఇలాంటి ప్రవర్తనకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేవలం వరల్డ్‌ కప్‌ సందర్భంగానే కాకుండా అంతకుముందు ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ పర్యటనల సమయంలోనూ దురుసుగా వ్యవహరించినట్లు సమాచారం. 

‘‘షహీన్‌ ప్రవర్తన సరిగా లేదని విమర్శలు వచ్చాయి. కోచ్‌లు, మేనేజ్‌మెంట్‌ సిబ్బందితోనూ ఇలానే వ్యవహరించాడు. అయితే, ఎవరూ ఫిర్యాదు చేయకపోయేసరికి చర్యలు తీసుకోలేదు. జట్టులోని ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం ఉంది. ఇదంతా మేనేజ్‌మెంట్ బాధ్యత. షహీన్‌పై విచారణ ఎందుకు చేపట్టలేదో అర్థంకావడం లేదు. ఇటీవల మ్యాచుల్లో కొందరు ఆటగాళ్లు లాబీయింగ్‌ ద్వారా జట్టులోకి వచ్చారు. ఒక్కరు కూడా బాధ్యతతో ఆడలేదు. దీంతో పీసీబీ ఛైర్మన్‌కు దీనిపై ఫిర్యాదు అందడంతో విచారణకు ఆదేశించారు’’ అని పాక్‌ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. 

చెప్పాల్సింది చాలా ఉంది: వాహబ్ రియాజ్

‘‘పీసీబీ సెలక్షన్‌ కమిటీలో సభ్యుడిగా నా సేవలు ముగిశాయి. నిబద్ధతతో, ఆటపై ప్రేమతో సేవలు అందించా. వంద శాతం పాక్‌ క్రికెట్‌ వృద్ధి కోసం పని చేశానని ప్రజలకు తెలుసు. సెలక్షన్ ప్యానెల్‌లో అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా భావించా. నాణ్యమైన జాతీయ జట్టును ఎంపిక చేయడంలో ఏడుగురితో కూడిన ప్యానెల్‌ శ్రమించింది. గ్యారీ కిరిస్టెన్‌, ఇతర కోచింగ్ సిబ్బందిపై మేం నమ్మకం ఉంచాం. తప్పకుండా భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్నాం. చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ, నేనెవరినీ తప్పుబట్టేందుకు ప్రయత్నించడం లేదు’’ అని రియాజ్‌ పోస్టు చేశాడు.

బాబర్‌.. ఇక చాలు: షాహిద్‌ అఫ్రిది

బాబర్ అజామ్‌కు కెప్టెన్‌గా చాలా అవకాశాలు వచ్చాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడని పాక్‌ మాజీ సారథి షాహిద్‌ అఫ్రిది విమర్శించాడు. ‘‘కెప్టెన్ లేదా కోచ్‌గా నియమించినప్పుడు కొంత సమయం ఇచ్చారు. అలాగే బాబర్‌కు అవకాశం దక్కింది. నాతోపాటు యూనిస్, మిస్బా కూడా సారథులుగా పనిచేసినవారే. మాకెవరికీ బాబర్‌లా మరిన్ని ఛాన్స్‌లు రాలేదు. వరల్డ్ కప్‌ కూడా ముగిసింది. విఫలమైనప్పుడు ఎవరైనా సరే కెప్టెన్‌పైనే నిందలు వేస్తారు. ఇప్పటికే బాబర్ రెండో, మూడో ప్రపంచ కప్‌లు, ఆసియా కప్‌ల్లో సారథ్యం వహించాడు. చాలా అవకాశాలు వచ్చాయి. ఇంకా మీరు బాబర్‌నే కొనసాగించాలని అనుకుంటే.. చాలా విషయాలను పూరించాల్సి ఉంది. కొత్తవారిని తీసుకొని వస్తే మాత్రం అతడికి కొంతకాలం ఛాన్స్ ఇవ్వాలి’’ అని షాహిద్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని