IND vs PAK: గేమ్‌ ప్లాన్‌ చెప్పేసిన షహీన్‌... వరల్డ్‌ కప్‌లో రాహుల్‌ కష్టమే అన్న సన్నీ

ప్రతి మ్యాచ్‌లో తన గేమ్‌ ప్లాన్‌ ఒకేలా ఉంటుందని.. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేలా చేయడమే లక్ష్యమని పాక్‌ పేసర్ షహీన్ అఫ్రిది వ్యాఖ్యానించాడు. అలాగే ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన కేఎల్‌ను వరల్డ్ కప్‌ కోసం పరిగణనలోకి తీసుకోకపోవడమే ఉత్తమమని భారత క్రికెట్‌ దిగ్గజం తెలిపాడు. ఆ విశేషాలు మీ కోసం..

Published : 02 Sep 2023 14:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దాయాదుల పోరులో ప్రధాన ఆకర్షణగా నిలిచేది భారత్‌ బ్యాటింగ్ వర్సెస్‌ పాకిస్థాన్‌ పేస్‌ బౌలింగ్‌. అందులోనూ రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ వంటి టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లను అడ్డుకోవడానికి పాక్‌ తన అస్త్రం షహీన్ అఫ్రిది మీద ఎక్కువగా ఆధారపడటం సహజమే. గత టీ20 ప్రపంచకప్‌లో భారత టాప్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చిన షహీన్‌ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడు? టీమ్‌ఇండియా అతణ్ని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో షహీన్‌ తన గేమ్‌ ప్లాన్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కొత్త బంతితో త్వరగా ఓపెనర్లను ఔట్‌ చేయడం వల్ల మిడిలార్డర్‌పై ఒత్తిడి పడుతుందని చెప్పాడు. 

షహీన్‌.. ఎందుకంత స్పెషల్‌? పాక్‌ ఫాస్ట్‌బౌలర్‌పై ఎందుకింత చర్చ?

నా గేమ్‌ ప్లాన్‌ చాలా సింపుల్‌. ప్రతి ఓపెనర్‌కూ నా గేమ్ ప్లాన్ తెలుసు. ఒకే ఒక్క లక్ష్యంతో మైదానంలోకి దిగుతా. త్వరగా ఓపెనర్లను ఔట్‌ చేయడమే నా మొదటి కర్తవ్యం. అప్పుడు మిగతావారిపై ఒత్తిడి పెరుగుతుంది. కొత్త బంతిని ఎదుర్కోవడానికి వచ్చే మిడిలార్డర్‌ బ్యాటర్లకు పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. వారిని విపరీతమైన ఒత్తిడికి గురి చేసే అవకాశం లభిస్తుంది

- షహీన్‌ షా


రాహుల్‌ పరిగణనలోకి తీసుకోవద్దు: సునీల్ గావస్కర్

ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన భారత స్టార్‌ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ ఎంపికపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడి పరిస్థితిని సరిగా అంచనా వేయకుండా ఎందుకు సెలెక్ట్‌ చేసినట్లు అని ప్రశ్నించాడు. వచ్చే వన్డే ప్రపంచ కప్‌ కోసం ప్రకటించనున్న జట్టులోకి అతడిని తీసుకోకపోవడమే మంచిదని వ్యాఖ్యానించాడు. 

కేఎల్ రాహుల్‌ తన గాయంపై ఇంకా చికిత్స తీసుకోవాలని భావిస్తున్నాడు. ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో సెప్టెంబర్ 5లోపు రాహుల్‌ ప్రదర్శనను చూసే అవకాశం ఉండదు. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసే జట్టులో అతడికి ఏ ప్రాతిపదికన చోటు కల్పిస్తారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే అతడిని పరిగణనలోకి తీసుకోకుండా జట్టు ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇలా చెప్పడం ఇబ్బందే కానీ అదే వాస్తవం. వన్డే వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌లోకి రావడం కేఎల్‌ రాహుల్‌కు కష్టమే

- సునీల్ గావస్కర్‌ 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని