WI vs USA: యూఎస్‌ఏ కథ ముగిసె.. విండీస్ ఆశలు మిగిలె

ఆ రెండు టీమ్‌లు టీ20 ప్రపంచ కప్‌ మెగా టోర్నీకి ఆతిథ్య దేశాలు. సూపర్‌-8లో తొలిసారి తలపడ్డాయి. అయితే, పెద్దగా పోటీ లేకుండానే ఓ జట్టు విజయం సాధించింది.

Updated : 22 Jun 2024 10:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సహ ఆతిథ్య దేశాల మధ్య పోటీ ఏకపక్షంగా ముగిసింది. టీ20 ప్రపంచకప్‌ (ICC Mens T20 World Cup) సూపర్‌-8 పోరులో యూఎస్‌ఏ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏను వెస్టిండీస్‌ 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఎస్‌ఏ 128 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 10.5 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిన విండీస్‌కు ఈ విజయం అత్యంత అవసరం. 

దంచేసిన షై హోప్

తొలి మ్యాచ్‌లో ఓటమితో నెట్‌ రన్‌రేట్‌ను భారీగా పెంచుకొనేందుకు విండీస్‌ బ్యాటర్లు (West Indies Batters) దూకుడు ప్రదర్శించారు. యూఎస్‌ఏ (USA) నిర్దేశించిన టార్గెట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నించి సక్సెస్‌ అయ్యారు. 129 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ బ్యాటర్ షై హోప్ (82*: 39 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. జాన్సర్‌ ఛార్లెస్‌ (15) ఎక్కువసేపు నిలవలేదు. నికోలస్‌ పూరన్‌తో (27*: 12 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్స్‌లు) కలిసి హోప్‌ లక్ష్యాన్ని ఛేదించాడు. గత మ్యాచుల్లో ప్రభావం చూపిన సౌరభ్‌ నేత్రవల్కర్ ఈసారి తేలిపోవడం యూఎస్‌ఏకు ఎదురుదెబ్బ తగిలింది. హర్మిత్‌ సింగ్‌ ఒక వికెట్‌ తీశాడు. 

విండీస్‌ బౌలింగ్ అదరహో

సాధారణంగా బార్బడోస్ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంటాయి. కానీ, తమ సొంత మైదానాల్లో విండీస్‌ (Windies) బౌలర్లు చెలరేగిపోయారు. యూఎస్‌ఏ ఓపెనర్ ఆడ్రిస్ గౌస్ (29) టాప్‌ స్కోరర్‌. నితీశ్‌కుమార్ 20, మిలింద్ కుమార్ 19, వాన్‌ 18, అలీ ఖాన్ 14, ఆరోన్ జోన్స్ 11 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో ఆండ్రి రస్సెల్ 3, రోస్టన్ ఛేజ్ 3, అల్జారీ జోసెఫ్‌ 2, మోతీ ఒక వికెట్ పడగొట్టారు. దీంతో యూఎస్‌ఏ 19.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. అత్యంత పొదుపుగా బౌలింగ్‌ వేసిన రోస్టన్ ఛేజ్‌కు (3/19) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇక చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో విండీస్‌ (జూన్ 24న) ఆడనుంది. అందులోనూ విజయం సాధిస్తే సెమీస్‌కు చేరుకొనేందుకు ఎక్కువ అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లాండ్‌ కూడా ఈ రేసులో ఉంది. యూఎస్‌ఏతో జూన్‌ 23న తలపడనుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని