IND vs BAN: మాలో పోరాటం పటిమ నశించింది.. భారత్‌ చేతిలో ఓటమిపై షకిబ్ వ్యాఖ్యలు

సూపర్‌-8లో తమ జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని బంగ్లా సీనియర్ ప్లేయర్ షకిబ్ వ్యాఖ్యానించాడు.

Updated : 23 Jun 2024 13:42 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8లో (T20 World Cup 2024) బంగ్లాదేశ్‌ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. దీంతో సెమీస్‌ అవకాశాలను కోల్పోయింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ, తమ జట్టు పోరాట పటిమ చూపించడంలో ఘోరంగా విఫలమైందని బంగ్లాదేశ్‌ సీనియర్ క్రికెటర్ షకిబ్ అల్‌ హసన్‌ వ్యాఖ్యానించాడు. భారత్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 147 పరుగులకే పరిమితమైంది. షాంటో (40) కీలక ఇన్నింగ్స్‌ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. షకిబ్ కూడా 11 పరుగులే చేసి ఔటయ్యాడు. దూకుడుగా ఆడటంలో బంగ్లా విఫలం కావడంతో 50 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.

‘‘ఇలాంటి భారీ టోర్నీలకు వచ్చినప్పుడు మెరుగైన ఆటతీరును ప్రదర్శించాలని అనుకుంటాం. లీగ్‌ స్టేజ్‌లో అలా ఆడే సూపర్‌-8కి చేరాం. ఇక్కడ మాత్రం సరైన ఫలితాలను అందుకోలేకపోతున్నాం. సరైన పోరాట పటిమ చూపించలేకపోతున్నట్లు అనిపిస్తోంది. ఇలా చేస్తే మేం ఎప్పుడు టైటిల్‌ విజేత అవుతామనేది  చెప్పడం చాలా కష్టం. ఈ స్టేజ్‌లో రెండు పెద్ద జట్లతో పోటీ పడుతున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వరల్డ్‌ కప్‌ టైటిల్‌ రేసులో అవి ముందు వరుసలో ఉన్న టీమ్‌లు. వారికి, మనకు ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. మా ఆటతీరు చాలా నిరుత్సాహానికి గురి చేసింది’’ అని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ పడగొట్టిన 37 ఏళ్ల షకిబ్.. టీ20 ప్రపంచ కప్‌లో 50 వికెట్లు మైలురాయికి చేరిన తొలి బౌలర్‌గా నిలిచాడు. మొత్తం 42 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు.

అవసరమైతేనే జట్టులో ఉంటా

‘‘జట్టుకు అవసరమైతేనే అందుబాటులో ఉంటా. ఫిట్‌నెస్‌, ఆటపరంగా అత్యుత్తమంగా ఉంటే తప్పకుండా దేశం కోసం ఆడతా. ఒకవేళ ఆటను ఆస్వాదించలేకపోతున్నానని అనిపిస్తే.. జట్టుకు ఆడను. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి సమయం వస్తుంది. అప్పుడు సరైన నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతా’’ అని షకిబ్ వ్యాఖ్యానించాడు. బంగ్లా తరఫున 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన షకిబ్ అన్ని ఫార్మాట్లు కలిపి 19,500+ పరుగులు, 700+ వికెట్లు తీశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని