Shakib: అసలు సెహ్వాగ్‌ ఎవరు? నేనెవరికీ సమాధానం చెప్పక్కర్లేదు: షకిబ్

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ తనపై చేసిన విమర్శలకు స్పందించే క్రమంలో షకిబ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తాను ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

Updated : 14 Jun 2024 15:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నెదర్లాండ్స్‌పై (BAN vs NED) అద్భుత ఇన్నింగ్స్‌తో బంగ్లాదేశ్‌ విజయంలో సీనియర్‌ ప్లేయర్ షకిబ్ అల్ హసన్ (Shakib Al Hasan) కీలక పాత్ర పోషించాడు. దీంతో తన ఆటతీరుపై వచ్చిన విమర్శలకు గట్టికౌంటర్‌ ఇచ్చాడు. సూపర్-8కి బంగ్లా చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌ విజయం అత్యంత కీలకం. షకిబ్ 46 బంతుల్లో 64 పరుగులు చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 159/5 స్కోరు చేసింది. అనంతరం నెదర్లాండ్స్‌ను 134 పరుగులకే పరిమితం చేసింది. మ్యాచ్‌ తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షకిబ్ మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag)చేసిన కామెంట్లను రిపోర్టర్లు అతడి దృష్టికి తీసుకొచ్చారు. దానికి స్పందిస్తూ ‘వీరేంద్ర సెహ్వాగ్‌ ఎవరు? నేనెందుకు సమాధానం ఇవ్వాలి’’ అని వ్యాఖ్యానించడం నెట్టింట వైరల్‌గా మారింది. 

వారిద్దరి వల్లే గెలిచాం.. 

‘‘ఇన్నింగ్స్‌ చివరి వరకూ టాప్‌-4లో ఒకరు బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం ఉందని గుర్తించాం. బ్యాటింగ్‌లో విలువైన ఇన్నింగ్స్‌ ఆడటం ఆనందంగా ఉంది. ఇక్కడ బ్యాటింగ్‌ చేయడం తేలిక కాదు. అదే సమయంలో మేం నిర్దేశించిన లక్ష్యం పెద్దదేమీ కాదు. మా బౌలర్లు సరైన సమయంలో వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఫిజ్‌, రిషద్ నాణ్యమైన బౌలింగ్‌తో నెదర్ల్లాండ్స్‌పై విజయం సాధించగలిగాం’’ అని షకిబ్ తెలిపాడు. ఈ విజయంతో బంగ్లా ‘సూపర్-8’ రేసులోకి వచ్చింది. ప్రస్తుతం గ్రూప్-Dలో రెండో స్థానంలో ఉన్న ఆ జట్టు నేపాల్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే తదుపరి దశకు చేరుకోవడం ఖాయం. ఈ గ్రూప్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో ఇప్పటికే దక్షిణాఫ్రికా ‘సూపర్-8’కి వెళ్లిపోయింది. 

గతంలో సెహ్వాగ్‌ ఏమన్నాడంటే? 

‘‘టీ20ల నుంచి రిటైర్‌ కావాలని గత వరల్డ్‌ కప్‌ సమయంలోనే నేను చెప్పా. అతడు పొట్టి ఫార్మాట్‌కు సరైన ప్లేయర్ కాదు. సీనియర్ ప్లేయర్‌గా, ఒకప్పటి కెప్టెన్‌గా ఇప్పటికీ జట్టులో కొనసాగుతున్నాడు. అతడి గణాంకాలను చూసి సిగ్గుపడాలి. ఇకనైనా సొంతంగా ముందుకొచ్చి వీడ్కోలు పలికాలి’’ అని సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని