బంగ్లా బోర్డు నన్ను తప్పుగా చిత్రీకరించింది..! 

శ్రీలంకతో టెస్టు సిరీస్‌ కాదని, ఐపీఎల్‌ ఆడేందుకు ప్రాధాన్యత ఇవ్వడంపై బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు తనని తప్పుగా చిత్రీకరించిందని ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ విచారం వ్యక్తం చేశాడు...

Published : 22 Mar 2021 01:47 IST

ఐపీఎల్‌ ఆడటం నాకు ఉపయోగం: షకిబ్‌ 

ఢాకా: శ్రీలంకతో టెస్టు సిరీస్‌ కాదని, ఐపీఎల్‌ ఆడేందుకు ప్రాధాన్యత ఇవ్వడంపై బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు తనని తప్పుగా చిత్రీకరించిందని ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ విచారం వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ ఎలాగూ ఆడటం లేదనే ఉద్దేశంతోనే తాను ఐపీఎల్‌ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. అది తనకు ఉపయోగకరమని, జట్టుకు కూడా మంచిదని షకిబ్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో ఆడే టీ20 ప్రపంచకప్‌ కోసం ఈ టీ20 లీగ్‌ ఉపయోగపడుతుందని స్పష్టం చేశాడు.

‘శ్రీలంకతో ఆడాల్సిన రెండు టెస్టుల సిరీస్‌.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మాకు చివరిది. ఏలాగూ మేం ఫైనల్లో ఆడట్లేదు. ఆ పాయింట్ల పట్టికలో మా జట్టు చివరి స్థానంలో ఉంది. కాబట్టి, నేను ఆ సిరీస్‌లో ఆడినా, ఆడకపోయినా పెద్ద తేడా లేదు. అలాగే నేను ఐపీఎల్‌ ఆడడానికి ఇంకో ప్రధాన కారణం ఉంది. అదేంటంటే.. ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. అందులో మేం సాధించాల్సింది చాలా ఉంది. అదెంతో ముఖ్యమైన టోర్నీ. ఈ టెస్టు సిరీస్‌లో మేం సాధించాల్సింది ఏమీ లేదు. దీంతో ఐపీఎల్‌ ఆడటమే మంచిదని నేను అనుకున్నా’ అని షకిబ్‌ పేర్కొన్నాడు.

అలాగే ఇకపై తాను టెస్టు క్రికెట్‌ ఆడనని చాలా మంది మాట్లాడుతున్నారని, దీంతో వారికి ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నట్లు బంగ్లా ఆల్‌రౌండర్‌ పేర్కొన్నాడు. ‘ఇకపై నేను టెస్టు క్రికెట్‌ ఆడనని చెప్పేవారందరూ.. నేను బీసీబీకి రాసిన లేఖను పూర్తిగా చదవలేదని అనుకుంటా. ఆ లేఖలో నేనెక్కడా టెస్టు క్రికెట్ ఆడనని చెప్పలేదు. రాబోయే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకునే ఐపీఎల్‌లో ఆడాలనుకుంటున్నట్లు వివరించాను. కానీ, అక్రమ్‌ భాయ్‌(బంగ్లా క్రికెట్‌ ఆపరేషన్స్‌ ఛైర్మన్‌) ఇది చెప్పకుండా ఎంతసేపూ నేను టెస్టు క్రికెట్‌ ఆడాలనుకోవడం లేదనే అన్నాడు’ అని షకిబ్‌ అసలు విషయం బయటపెట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని