IND vs BAN: ఓటమికి సాకులు చెప్పాలనుకోవడం లేదు: బంగ్లా కెప్టెన్‌

తొలి టెస్టులో భారత జట్టు అద్భుతంగా ఆడిందని బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌ హసన్‌(Shakib al hasan) అన్నాడు. తాము మరింత మెరుగ్గా ఆడితే గెలిచేవారమని అభిప్రాయపడ్డాడు. 

Updated : 18 Dec 2022 20:09 IST


చట్‌గావ్‌:  భారత్‌తో తొలి టెస్టు(IND vs BAN)లో తమ జట్టు ఓటమికి ఎలాంటి సాకులు వెతకబోమని బంగ్లాదేశ్‌ జట్టు కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ అన్నాడు. టెస్టు సిరీస్‌లో భాగంగా 5వ రోజు జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 150 పరుగులతో సరిపెట్టుకుంది. దీంతో భారత్‌ 188 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.  మ్యాచ్‌ అనంతరం తమ జట్టు ఓటమిపై షకిబ్‌ స్పందించాడు.

‘‘బ్యాటింగ్‌కు ఇది నిజంగా అద్భుతమైన ఫీల్డ్‌. కానీ, మేం తొలి ఇన్నింగ్స్‌లో మెరుగ్గా ఆడలేకపోయాం. ఈ మ్యాచ్‌కు ముందు టెస్టుల్లో మాకు 5-6 నెలల విరామం వచ్చిన మాట నిజమే. అయినా, ఈ ఓటమికి ఎలాంటి సాకులు చెప్పకూడదని అనుకుంటున్నాం. టీమ్‌ఇండియా(Team India) అద్భుతంగా  ఆడింది.  వారికి ఈ క్రెడిట్‌ దక్కుతుంది. జాకీర్‌ హసన్‌ దేశీయ క్రికెట్‌లో పరుగులు తీస్తూ రాణించాడు. అందుకే మేం అతడిని ఈ జట్టులోకి ఎంపిక చేసుకున్నాం. బంగ్లా తరఫున ఈ ఆటగాడు మరిన్ని శతకాలు నమోదు చేయాలని కోరుకుంటున్నా. ఈ ఐదు రోజుల్లో బాగా ఆడితే విజయం సాధించేవాళ్లం. భారత్‌లాంటి జట్టును గెలవాలంటే కనీసం నాలుగు ఇన్నింగ్స్‌ అయినా మెరుగ్గా ఆడితీరాలి’’ అంటూ షకిబ్‌(Shakib al hasan) పేర్కొన్నాడు. 

రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా ఆటగాళ్లు బాగా ఆడినప్పటికీ రాణించలేకపోయారు. ఓపెనర్లు నజ్ముల్‌ హోస్సేన్‌, జాకీర్‌ హసన్‌ 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సిరీస్‌తో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన జాకీర్‌ హసన్‌ తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. మరింత పోరాడాలని ప్రయత్నించినప్పటికీ జట్టు నుంచి సరైన సహకారం అందకపోవడంతో పెవిలియన్‌ బాట పట్టాడు. అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ ఏడు వికెట్ల భాగస్వామ్యంతో బంగ్లా జట్టు 324 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు సిరీస్‌ మీర్పూర్‌ వేదికగా డిసెంబర్‌ 22న ప్రారంభం కానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని