Shane Warne : ‘‘డాడీ.. మీరు ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటారు’’

స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ హఠాన్మరణం అతడి కుటుంబ సభ్యులనే కాకుండా...

Published : 09 Mar 2022 01:24 IST

తండ్రిపై ప్రేమను వ్యక్తం చేసిన షేన్‌వార్న్‌ పిల్లలు

ఇంటర్నెట్ డెస్క్‌: స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ హఠాన్మరణం అతడి కుటుంబ సభ్యులనే కాకుండా క్రికెట్ అభిమానులను సైతం శోకసముద్రంలో మునిగేలా చేసింది. సహచరులు సహా ప్రతి ఒక్కరూ సంతాపం తెలియజేశారు. ఇంతలా అందరి గుండెల్లో నిలిచిపోయిన షేన్‌వార్న్‌ లేనిలోటు ఆయన పిల్లలకు తీర్చలేనిది. షేన్‌వార్న్‌కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. ‘‘మా నాన్న లేనిలోటు ఎప్పటికీ తీర్చలేనిది. మిగిల్చిన శూన్యతను ఏదీ పూరించలేదు’’ అని వార్న్‌ సంతానం ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రికి హృదయపూర్వక నివాళులర్పిస్తూ భావోద్వేగపూరిత లేఖను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అలానే తమ కుమారుడి లేనిలోటును వర్ణించడానికి మాటలు రావడం లేదని షేన్‌వార్న్‌ తల్లిదండ్రులు కీత్‌, బ్రిగిట్ తెలిపారు.

‘‘మా నాన్నే నాకు బెస్ట్‌ ఫ్రెండ్. లవ్‌ యూ డాడీ. నా హృదయంలో మిగిల్చి వెళ్లిన శూన్యతను ఏదీ పూరించలేదని భావిస్తున్నా. పోకర్‌ టేబుల్‌ పక్కన కూర్చొని ఉండటం, గోల్ఫ్‌ కోర్స్‌లో వాకింగ్, పిజ్జా తినడం.. ఇలా ఏదీ అప్పటిలా ఉండబోదు. ఎల్లవేళలా నేను సంతోషంగా ఉండాలని ఎప్పుడూ నువ్వు కోరుకుంటావని నాకు తెలుసు. అందుకే ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తా’’ షేన్‌వార్న్‌ కుమారుడు జాక్‌సన్ 

‘‘డాడీ.. నిన్ను చాలా మిస్‌ అవుతున్నా. నిజంగా నువ్వు ఉత్తమ తండ్రివి. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నాన్న. జీవితం ఎంతో క్రూరమైంది.. నా తండ్రిని చాలా త్వరగా తీసుకెళ్లింది. నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్న చివరి జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుకు పెట్టుకుంటా. మనమిద్దరం చాలా విషయాల్లో సారూప్యత కలిగి ఉన్నాం. మీ నుంచి వారసత్వంగా వచ్చిందని, నాకు అదే కోపం తెప్పించిందని అప్పుడప్పుడూ నేను జోక్ చేస్తుండేదానిని ’’ - పెద్ద కుమార్తె బ్రూక్‌

‘‘మిమ్మల్ని నాన్న అని పిలవడం ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా డాడీ. ఇప్పటికే చాలా మిస్‌ అవుతున్నాను. నేను నిన్ను గట్టిగా కౌగలించుకుని ఆనందించిన క్షణాలే నాకు చివరివి అవుతాయని ఊహించలేదు. మీతో గడపడానికి నాకు ఎక్కువ సెలవులు కావాలి. సంతోషంగా గడపాలి. మీ నవ్వుతో గదినంతా వెలుగుమయం చేస్తారు. ఇంకానూ ‘గుడ్‌నైట్‌.. ఐ లవ్‌ యూ’’ అని అనాలి. మీరు పక్కన ఉంటే మేమంతా ఎంతో సురక్షితంగా ఉంటామనే నమ్మకం. మీరు మరణించలేదు నాన్న.. ఇక్కడ నుంచి వేరొక ప్రదేశానికి వెళ్లారు.. అది మా హృదయంలోకి’’ -  చిన్న కుమార్తె సమ్మర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు