Shane Warne: ‘ఆ టిన్లపై నా పేరు ఉండేసరికి.. అంతా నాకే అనుకున్నారు’

షేన్‌వార్న్‌ మంచి ఆహార ప్రియుడు. అతడికి బేక్డ్‌ బీన్స్‌ (సాస్‌తో వేయించిన గింజలు), నూడుల్స్‌ అంటే విపరీతమైన ఇష్టం. ఎంతలా అంటే తన కుటుంబం ఎప్పుడైనా భోజనానికి బయటకు వెళ్లిన సందర్భంలోనూ వాటిని ప్రత్యేకంగా తమ మెనూలో ఉండేలా చూసుకునేంతలా...

Updated : 05 Mar 2022 15:03 IST

భారత్‌లో షేన్‌వార్న్‌కు ఎదురైన వింత అనుభవం గురించి తెలుసా?

షేన్‌వార్న్‌ మంచి ఆహార ప్రియుడు. బేక్డ్‌ బీన్స్‌ (సాస్‌తో వేయించిన గింజలు), నూడుల్స్‌ అంటే విపరీతమైన ఇష్టం. తన కుటుంబం ఎప్పుడైనా భోజనానికి బయటకు వెళ్లిన సందర్భంలోనూ వాటిని ప్రత్యేకంగా తమ మెనూలో ఉండేలా చూసుకుంటాడు. అయితే.. వార్న్‌ హఠాన్మరణంతో ఇప్పుడు పలువురు అభిమానులు ఆ బేక్డ్‌ బీన్స్‌ టిన్లతోనే నివాళులు అర్పిస్తున్నారు. సిడ్నీ క్రికెట్‌ మైదానం గేట్‌ వద్ద వాటిని ఉంచి ఈ స్పిన్‌ దిగ్గజాన్ని స్మరించుకుంటున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ బేక్డ్‌ బీన్స్‌కు సంబంధించే షేన్‌వార్న్‌పై భారత్‌లో ఓ వింత అభిప్రాయం ఉంది. అదేంటో మనం ఓసారి గుర్తుచేసుకుందాం.

అది 1998 ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటన కోసం భారత్‌కు వచ్చిన సందర్భం. అప్పటికే మేటి స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న వార్న్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది. అతడు భారత భోజనం (స్పైసీ ఎక్కువ ఉందని) తినలేక ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా తన కోసం సాస్‌తో వేయించిన గింజలు, నూడుల్స్‌ టిన్లను సుమారు మూడు టన్నులు తెప్పించుకున్నాడని వార్తలు వచ్చాయి. అతడు భారత్‌లో ఉన్నన్ని రోజులు అవే తిన్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే, అదంతా తనపై జరిగిన తప్పుడు ప్రచారం అని, అప్పట్లో అసలేం జరిగిందనే విషయాన్ని వార్న్‌ రెండేళ్ల కిందట ఓ వీడియోలో వివరించాడు.

‘ఆ పర్యటనలో నేను కేవలం ఆ గింజలు మాత్రమే తిన్నానని అంతా అనుకున్నారు. అదంతా అబద్ధం. తప్పుడు సమాచారం. ఆ సుదీర్ఘ పర్యటనలో మేం టీమ్‌ఇండియాతో టెస్టు సిరీస్‌ ముగించుకొని వన్డేలకు సిద్ధం అవుతుండగా ఓ రోజు మా కోచ్‌ జియో మార్ష్‌ అల్పాహారం చేసేటప్పుడు ఆ గింజలు, నూడుల్స్‌ తింటూ కనిపించాడు. అప్పటికే మా జట్టంతా చాలా రోజులుగా భారత వంటకాలు తింటుండంతో మాక్కూడా వాటిని తినాలనిపించింది. దీంతో మాకోసం వాటిని ఇక్కడికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయగలరా అని మేమంతా కోచ్‌ను అడగడంతో ఆయన మరుసటి రోజే క్రికెట్‌ ఆస్ట్రేలియాతో మాట్లాడారు. వారు వెంటనే ఓ విమానంలో 1900 టిన్నులను భారత్‌కు పంపించారు. అయితే, క్రికెట్‌ ఆస్ట్రేలియా పంపిన ఆ ప్యాకింగ్‌లపై రెండు వైపులా షేన్‌వార్న్ ‌(ఇండియా) అని రాసి ఉండటంతో అంతా నా కోసమే అనుకున్నారు. నిజానికి వాటిని జట్టు సభ్యులందరూ కావాలనుకున్నారు. తలా కొన్ని టిన్లు తీసుకొన్నాక మిగిలిన వాటిని స్థానికంగా ఉండే ప్రజలకు అందజేశాం. అలా నేను భారత పర్యటనకు వస్తే బేక్డ్‌ బీన్స్‌, నూడుల్స్‌ తింటాననే అపోహలు, కథనాలు ప్రచారంలోకి వచ్చాయి' అని వార్న్‌ స్పష్టం చేశాడు.

ఇదిలా ఉండగా, షేన్‌వార్న్‌కు ఆ గింజలు, నూడుల్స్‌ అంటే ఎంత ఇష్టమో ఆయన కుమారుడు జాక్‌సన్‌ సైతం ఓ సందర్భంలో వివరించాడు. తన తండ్రికి ఆ గింజలంటే విపరీతమైన ఇష్టం అని, ఏదైనా సందర్భంలో తమ కుటుంబం బయటకు వెళితే అప్పుడు తన వెంట తెచ్చుకున్న టిన్లను వార్న్‌.. ఆయా రెస్టారెంట్‌ల చెఫ్‌లకు అందజేసీ.. తమకోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తాడని చెప్పాడు. తన తల్లి, తోబుట్టువులంతా వారికిష్టమైన అల్పాహారాలు ఆర్డర్‌ చేస్తే.. వార్న్‌ మాత్రం అందులో ఆ గింజలు లేదా నూడుల్స్‌ ఉండేలా చూసుకుంటాడని పేర్కొన్నాడు. దీన్నిబట్టి ఈ లెజెండరీ స్పిన్నర్‌కు అవంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. అందువల్లే అభిమానులు కూడా ఆయన మృతికి నివాళిగా.. బేక్డ్‌ బీన్స్‌ టిన్లు పెట్టి విచారం వ్యక్తం చేస్తున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని